పోలీసుల ముందుచూపుతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే పరిస్థితిని చక్కదిద్దారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం పీచుపల్లి గ్రామశివారులోని గడ్డి పొదలకు నిప్పంటుకుని భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
ఎస్సై మధుకర్ సిబ్బందితో కలిసి అక్కడే ఉన్న రైతుల సహాయంతో నీళ్ల ట్యాంకర్ తెప్పించి మంటలను ఆర్పేశారు. కాసేపటికి అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు. పోలీసులు సకాలంలో స్పందించకుంటే సమీపంలోని పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లేదని రైతులు అంటున్నారు. పోలీసులే స్వయంగా మంటలార్పడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.