తనకు న్యాయం చేయాలంటూ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూర్ గ్రామానికి చెందిన రైతు రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన తెలిపాడు. రావుల రాజిరెడ్డి అనే రైతు తనకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిలో 2 నెలల క్రితం సుమారు రూ.60 వేల పెట్టుబడి పెట్టి పత్తి పంట వేసుకున్నాడు. కాగా... రెవెన్యూ అధికారులు ట్రాక్టర్‌తో పంటను తొలగించారని రైతు ఆరోపించారు.
తనకు రైతుబంధు పథకం డబ్బులు పడుతున్నాయని తెలిపారు. అధికారులు అన్యాయంగా పంటను నాశనం చేయారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన పంటకు పరిహారం చెల్లించి తగు న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతును సముదాయించగా... నిరసన విరమించాడు.
తహసీల్దార్ సురేశ్ కుమార్‌ను వివరణ కోరగా... ఆ భూమిని ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిందని తెలిపారు. ఆ భూమిలో గతంలో మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యేలు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారని... సంబంధిత రైతుకు పలుమార్లు ప్రభుత్వ భూమిని సాగు చేయవద్దని తెలిపినట్లు పేర్కొన్నారు.