‘నాడు తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ అండగా నిలిచినట్లు.. మరోసారి ఇదే హుజూరాబాద్ గడ్డ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటానికి ఊపిరి పోస్తుంది. రాచరికాన్ని బొందపెట్టేందుకు కేంద్రబిందువుగా మారుతుంది. మరోమారు పొలికేక వేస్తుంది. ఈ నియోజకవర్గ ప్రజలు నిండుమనసుతో ఆశీర్వదిస్తున్నారు. ‘‘బిడ్డా నీకు కేసీఆర్ ద్రోహం చేసిండు. ఎలాగైనా నిన్ను గెలిపిస్తామని దీవెనలిస్తున్నారు. ఈ నియోజకవర్గం ప్రలోభాలకు లొంగేది కాదు. ఆరుసార్లు రూపాయి ఆశించకుండా గుండెల్లో పెట్టుకుని ఇక్కడి ప్రజలు గెలిపించారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే పంథా ఉంటుంది. కేసీఆర్ ఎన్నడూ లేని విధంగా ఒక్కో మండలానికి మంత్రిని, ఎమ్మెల్యేలను నియమిస్తూ స్థానిక ప్రజాప్రతినిధుల్ని పక్కకు నెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కార్డులు, పింఛన్లు ఇస్తామని, డబ్బులిచ్చి సమావేశాలకు తీసుకెళ్తున్నారు. నాకు సహకరించే నాయకులను పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు నిర్బంధాలతో భయపెడుతున్నారు. ఇలాగే కొనసాగిస్తే ఖబడ్దార్ అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. మా ప్రజలు ప్రేమకు లొంగుతారే తప్ప.. దబాయింపులకు కాదు. ఇక్కడ కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడితే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ప్రగతిభవన్ అందించిన రాతల్ని చదివే మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. వారెంతగా బాధపడుతున్నారనేది వారి కుటుంబ సభ్యులకూ తెలుసు’.
-ఈటల రాజేందర్, మాజీ మంత్రి, భాజపా నేత
భాజపాలో చేరిన తరవాత తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన ఈటల(Etela Rajender)కు ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఉదయం శామీర్‌పేటలోని తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరిన ఈటల హుజూరాబాద్ నియోజకవర్గంలోని కాట్నపల్లి నుంచి నాగారం దాకా దాదాపు 40 కి.మీ. పర్యటించారు. ఆయనకు అడుగడుగునా ప్రజలు స్వాగతం పలికారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన రోడ్‌షో కొనసాగింది. ఈటల వెంట భాజపా నాయకులు స్వామిగౌడ్, వివేక్, ఏనుగు రవీందర్‌రెడ్డి ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లోపే అయిదుగురు భాజపా ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెడతామని..ఈటల(Etela Rajender) మూడో ఎమ్మెల్యేగా వస్తారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
పల్లా కాన్వాయ్ ఎదుట నినాదాలు
ఇల్లందకుంట మండలంలోని తెరాస కార్యకర్తలతో నిర్వహించే సమావేశానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన కాన్వాయ్‌తో వెళ్తుండగా కాట్నపల్లి వద్ద భాజపా శ్రేణులు, ఈటల వర్గీయులు అడ్డుతగిలి జై ఈటల(Etela Rajender) అంటూ నినాదాలు చేశారు. రాజేందర్‌కు స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున గుమిగూడిన అభిమానులు ఆయన కోసం నిరీక్షిస్తున్న సమయంలోనే ఎమ్మెల్సీ కాన్వాయ్ రావడంతో అడ్డుగా నిలబడ్డారు. పోలీసుల జోక్యంతో పల్లా ముందుకు సాగి వెళ్లిపోయారు.
- ఇదీ చదవండి : భాజపా నేత గెలుపుపై హైకోర్టుకు సీఎం- నేడే విచారణ