మాజీమంత్రి ఈటల రాజేందర్ 'ప్రజా దీవెన' యాత్రలో అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి నుంచి కొనసాగిన పాదయాత్ర.. వీణవంక మండలంలోకి ప్రవేశించింది. పోతిరెడ్డిపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో యాత్ర ముగించుకొని కొండపాక గ్రామానికి చేరుకున్నారు.
యాత్ర మధ్యలో ఈటల అస్వస్థతకు గురి కావటంతో.. వైద్యులను పిలిపించి పరీక్షలు చేయగా జ్వరం వచ్చినట్లు నిర్ధరించారు. తనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, బొడిగ శోభ ఉన్నారు. వైద్య చికిత్సలను పర్యవేక్షించారు. సమాచారం అందుకున్న ఈటల సతీమణి.. హుటాహుటిన కొండపాక చేరుకున్నారు. బీపీ90/60, షుగర్ లెవెల్ 265గా నమోదైంది. ప్రత్యేక బస్సులో వైద్యులు చికిత్స అందించారు. ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోవడంతో వెంటనే పాదయాత్ర నిలిపివేసి హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. డాక్టర్ల సలహా మేరకు ఈటలను హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఈటల ఆరోగ్యం నిలకడగానే ఉందని.. మెరుగైన వైద్యం కోసమే హైదరాబాద్ తరలించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈటల అనారోగ్యం పాలవడంతో పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు.
పార్టీ నేతల భరోసా
ఈ నెల 19న హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం నుంచి ‘ప్రజా దీవెన యాత్ర’ను ఈటల ప్రారంభించారు. ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా 70 గ్రామాల్లో 222 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఈటల రాజేందర్ అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. ఈటల కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈటలకు భాజపా అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు. కాగా యాత్ర ఇవ్వాళ్టితో 12వ రోజుకి చేరుకుంది.
ఇదీ చదవండి: CM KCR Speech: 'కేసీఆర్ ఏదనుకుంటే అది కావాల్సిందే.. ఎలా ఆపుతారో నేనూ చూస్తా..'