కరీంనగర్ సీపీ స్వయంగా సీఐలకు, పోలీసులకు ఫోన్ చేసి తమ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి భాజపాలోకి చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ.. భాజపా కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఈటల ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేసినట్లు ఈటల పేర్కొన్నారు. ఈ బెదిరింపులు, పంపకాలు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకేనని.. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరన్నారు. అన్నింటి కన్నా గొప్పది ప్రజాశక్తి అని పేర్కొన్న ఈటల.. ప్రజలే చరిత్ర నిర్మాతలని, హుజూరాబాద్ చరిత్ర రాసేది ఇక్కడి ప్రజలే అన్న విషయం మరవొద్దని హెచ్చరించారు. ప్రజలను ఆపగలిగే, కొనగలిగే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
కరీంనగర్ సీపీ స్వయంగా సీఐలు, ఎస్సైలకు ఫోన్లు చేసి.. మా పార్టీ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేసేలా చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి ఫిర్యాదు చేశాం. నేనేంటో స్థానిక సీఐలు, ఎస్సైలకు తెలుసు. ఈ బెదిరింపులు, పంపకాలు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకే. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరు. హుజూరాబాద్ చరిత్ర రాసేది ఇక్కడి ప్రజలే. ప్రజలను ఆపగలిగే, కొనగలిగే శక్తి ఎవరికీ లేదు.-ఈటల రాజేందర్, భాజపా నేత
ఇదీ చూడండి: Marriage Cancel: డిగ్రీ లేదని వివాహం రద్దు.. పీఎస్‌లో ఇరువర్గాల ఘర్షణ