Dialysis patients in Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూత్రపిండాల వైఫల్య బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 680 మంది బాధితులు ఉండగా.. కేవలం 327 బాధితులకు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తశుద్ధి చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం పడకల సంఖ్య కేవలం 35 మాత్రమే. ఈ కారణంగా 353 మంది ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో రక్తశుద్ధి చేసుకుంటుండగా.. ప్రైవేటు ఆసుపత్రుల్లో డబ్బు ఇచ్చి చేయించుకుంటున్న వారి సంఖ్య 100కు పైగా ఉన్నట్లు సమాచారం.
ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి: కిడ్నీ బాధితుల సంఖ్య తక్కువగా ఉన్న రోజుల్లో కరీంనగర్, సిరిసిల్ల పట్టణాల్లో 10 పడకలు, హుజూరాబాద్, గోదావరిఖని, జగిత్యాల పట్టణాల్లో 5 పడకల చొప్పున రక్తశుద్ధి కేంద్రాలను ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఉండటంతో కేవలం ఈ జిల్లాల వాసులే కాకుండా మంచిర్యాల, సిద్దిపేట జిల్లాల నుంచి కరీంనగర్‌కు వచ్చి రక్తశుద్ధి చేయించుకుంటున్నారు.
పెరుగుతోన్న బాధితుల సంఖ్య: సేవలు బాగున్నా కొన్నిఇబ్బందులు ఉన్నాయని రోగులు అంటున్నారు. ప్రత్యేకంగా డయాలిసిస్ కేంద్ర పర్యవేక్షణకు ఒక నెఫ్రాలజిస్టును నియమించాలని ఎన్నో రోజులుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు. అయితే గతంతో పోలిస్తే బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 5 రక్తశుద్ధి కేంద్రాల్లో పడకలు సరిపోక సకాలంలో రక్తశుద్ధి చేయించుకోలేక అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలం 35 పడకలు మాత్రమే ఉండటంతో 4 షిప్టుల్లో సేవలందిస్తున్నా ఒక్కొక్కరికి వారానికి మూడుసార్లు, నాలుగు గంటల చొప్పున కేటాయించాల్సిన పరిస్థితి ఉండటంతో ఇబ్బందిగా పరిణమిస్తోంది. ఇప్పటి వరకు హుస్నాబాద్ నియోజకవర్గం వారు కూడా కరీంనగర్‌కు రావడంతో సేవలు లభించడం కొంత ఇబ్బందిగా ఉండేదని ప్రస్తుతం హుస్నాబాద్‌లోను కేంద్రం ప్రారంభమైందని నిర్హకులు తెలిపారు. దీంతో కొంత ఒత్తిడి తగ్గిందని సిబ్బంది అంటున్నారు.
డయాలసిస్ కేంద్రాలు పెంచాలి: తొలుత తక్కువ పడకలతోనే డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసినా.. అవసరానికి అనుగుణంగా పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహ రోగుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా డయాలిసిస్ కేంద్ర అవసరాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని బాధితులు విన్నవిస్తున్నారు.
ఇవీ చదవండి: