custom milling rice problems in telangana : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సీఎంఆర్ కింద సేకరించిన ధాన్యం మిల్లుల్లోనే పేరుకుపోతోంది. ఇదిలా ఉండగా వర్షాలతో తేమ పెరిగి ధాన్యం తడిసి మొలకలొస్తున్నాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచటం వల్ల బియ్యం పసుపు రంగులో వస్తోందని.. దీంతో ఎఫ్‌సీఐ నిరాకరిస్తోందని మిల్లర్లు చెబుతున్నారు. సరిపడా గోదాములు లేక ఆరుబయటే టార్పాలిన్లు కప్పి ఉంచటంతో వర్షాలకు తడిసిపోతోంది.
మరోవైపు కస్టమ్ మిల్లింగ్‌లో భాగంగా ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలనే నిబంధనతో పాటు నాణ‌్యతా ప్రమాణాలు పాటించట్లేదని ఎఫ్‌సీఐ అధికారులు తిప్పి పంపటం మిల్లర్లకు తలనొప్పిగా మారిందంటున్నారు. దశాబ్ద కాలంగా మిల్లింగ్ ఛార్జీలు పెంచకపోగా కొత్త నిబంధనలు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారని మిల్లర్లు అంటున్నారు.
Telangana custom milling rice problems : ఉమ్మడి జిల్లాలో గతేడాది వానాకాలంలో మొత్తం 11.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 350 మిల్లులకు పంపించారు. ఇందులో 67 శాతం అంటే 7.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అప్పగించాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 2.46 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఎఫ్‌సీఐకి అప్పగించారు. ఇక యాసంగిలో మొత్తం 12.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపించగా 8.67 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది.
Rice custom milling in Telangana : ఇప్పటివరకు కేవలం 1.99 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఎఫ్‌సీఐకి అప్పగించారు. పలుమార్లు గడువు పొడిగిస్తున్నా వర్షాలు అధికంగా కురుస్తుండటంతో మిల్లుల్లో సీఎంఆర్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కొందరు మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని బయటి మార్కెట్లలో విక్రయించి ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాలలో తక్కువ ధరకు తెచ్చిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద అప్పగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పెద్దపల్లిలోని మిల్లులకు ఇతర జిల్లాలో పండిన ధాన్యాన్ని కేటాయిస్తుండటంతో గోదాముల కొరత ఏర్పడుతోంది.
మరోవైపు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌పై వేటు వేయటంతో ఏడాదిగా పోస్టు ఖాళీగా ఉంది. మంచిర్యాల డీసీఎస్వో ప్రేమ్ కుమార్‌కు అప్పగించగా ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. దీంతో సమన్వయం సైతం దెబ్బతింటోంది. తగిన సదుపాయాలు కల్పించి, నిల్వ చేసేందుకు స్థలం చూపిస్తే బియ్యం ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు మిల్లర్లు వెల్లడిస్తున్నారు. మరోవైపు.. అధికారులు సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లపై కేసులు పెడతామని బెదిరించడానికి బదులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని రైస్ మిల్లర్లు సూచిస్తున్నారు.
"కస్టమ్ మిల్లింగ్‌లో భాగంగా ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలనే నిబంధనతో పాటు.. నాణ‌్యతా ప్రమాణాలు పాటించట్లేదని సరుకును ఎఫ్‌సీఐ అధికారులు తిప్పి పంపుతున్నారు. దశాబ్ద కాలంగా మిల్లింగ్ ఛార్జీలు పెంచకపోగా కొత్త నిబంధనలు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారు". - సుధాకర్ రావు, రాష్ట్ర కార్యదర్శి రైస్ మిల్లర్స్ అసోసియేషన్
ఇవీ చదవండి :