సింగరేణి పరిధిలో 26 భూగర్భగనులు, 18 ఉపరితల గనుల్లో నిత్యం దాదాపు 47వేల మంది కార్మికులు ప్రతిరోజు దాదాపు రెండున్నర లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుంటారు. ప్రతి ఏడాది సింగరేణి సంస్థ డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తికి లక్ష్యాలను నిర్దేశించుకొంటుంది. గత ఏడాది 66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఈసారి మాత్రం 70మిలియన్ టన్నులు లక్ష్యంగా పెట్టుకొంది. ఏటా వెలికితీసే 65మిలియన్ టన్నుల్లో నుంచి 80శాతం అంటే 52 మిలియన్ టన్నులు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరఫరా అవుతోంది. అయితే కరోనా కారణంగా పరిశ్రమల నుంచి విద్యుత్ డిమాండ్ లేకపోవడం వల్ల ధర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తిని తగ్గిస్తుండటంతో బొగ్గు అవసరాలు తగ్గిపోయాయి. దీనికి తోడు విద్యుత్ కంపెనీలు కేవలం థర్మల్ విద్యుత్‌కే పరిమితం కాకుండా ఎక్కడ తక్కువ ధరకు విద్యుత్ లభిస్తే అక్కడి నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండటం వల్ల ఆ ప్రభావం బొగ్గు కొనుగోలుపై పడుతోంది.
బొగ్గు సరఫరాను తగ్గించుకుంటున్న సింగరేణి
సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గులో 80శాతం థర్మల్ విద్యుత్ కేంద్రాలకే సరఫరా చేస్తుంది. ఎన్టీపీసీకి 12 మిలియన్ టన్నులు, తెలంగాణ జెన్‌కోకు 17 మిలియన్ టన్నులు, జైపూర్ థర్మల్ పవర్ స్టేషన్‌కు 7మిలియన్ టన్నులు పోను మిగతా బొగ్గును ఏపీ జెన్‌కోతో పాటు, కర్నాటక పవర్ కార్పొరేషన్, గుజరాత్, మహారాష్ట్ర పర్లీ, మహాజెన్‌కో, తమిళనాడు రాష్ట్ర విద్యుత్ సంస్థలకు సింగరేణి బొగ్గు సరఫరా చేస్తోంది. ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి నేరుగా విద్యుత్తును కొనుగోలు చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడి థర్మల్ కేంద్రాలు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. పర్యవసానంగా సింగరేణి నుంచి కొనుగోలు చేసే బొగ్గులో 50శాతం కోత పడింది. ఆంధ్రప్రదేశ్ జెన్‌కో ప్రస్తుతం తమకు బొగ్గు అవసరం లేదని సమాచారం ఇవ్వడంతో అక్కడికి బొగ్గు సరఫరా నిలిచిపోయింది. ఇతర రాష్ట్రాల సంస్థలు కూడా కుదుర్చుకున్న ఒప్పందానికి సగానికి సగం తగ్గించమనడం వల్ల ప్రతిరోజు కేవలం లక్ష టన్నులలోపే ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఉపరితల గనుల్లో ఉత్పత్తి తగ్గింపుతో పెరిగిన సెలవులు
భూగర్భ గనుల కంటే ఉపరితల గనుల నుంచి బొగ్గు ఉత్పత్తికే ఖర్చు తగ్గుతుండటం వల్ల సింగరేణిలో 70శాతం బొగ్గు ఉపరితల గనుల నుంచే జరుగుతోంది. గతంలో ఆదివారంతో పాటు వారాంతపు సెలవు దినాల్లోనూ సాధారణ రోజుల మాదిరిగానే బొగ్గు ఉత్పత్తి చేసేవారు. ఆ రోజుల్లో ఉద్యోగులకు పేడేలు వర్తింపజేసేవారు. ప్రస్తుతం సెలవు దినాల్లో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. కరోనా సమయంలో విధించిన లేఆఫ్ నుంచి క్రమక్రమంగా ఉత్పత్తిని తగ్గించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం బొగ్గు నిల్వలు అధికంగానే ఉన్న డిమాండ్ లేకపోవడం వల్ల యాజమాన్యం ప్రత్యామ్నాయ డిమాండ్ వైపు ఆలోచిస్తోంది. ప్రస్తుతం ప్రతిరోజు 2.50లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అవకాశం ఉన్నా.. మార్కెట్ సంక్షోభంతో లక్ష టన్నులకు తగ్గించుకుంది. కొత్త గనులు అందుబాటులోకి వస్తే మరింత బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకుతో పాటు కొత్తగా న్యూ పాత్రిపాద క్షేత్రాన్ని దక్కించుకొంది. కొత్తగా గనులు అందుబాటులోకి రావడం వల్ల విఫణి విస్తరించేందుకు అవకాశం ఉన్నా.. బొగ్గు వినియోగదారుల నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి.
ఇవీ చూడండి: సచివాలయంపై కరోనా ప్రభావం.. ఉద్యోగుల్లో భయం భయం..