రంజాన్ పండగ సందడిపై కరోనా ప్రభావం - ramzan festival
రంజాన్ కొనుగోళ్లపై కరోనా ప్రభావం కనిపిస్తోంది. లాక్‌డౌన్ నిబంధనలు సడలించినా కొనుగోలుదారులు లేక... వ్యాపార వాణిజ్య సముదాయాలు బోసిపోతున్నాయి. వస్త్రదుకాణాలు, పండ్ల దుణాకాలకు గిరాకీ లేదని... యజమానులు చెబుతున్నారు. లాక్‌డౌన్ వల్ల జనం ఉపాధి కోల్పోవడం... ప్రభావం చూపిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ పండగ సందడి కనిపించడంలేదు. కొనుగోలుదారులు లేక దుకాణాలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. సడలింపులతో చాలా వరకు దుకాణాలు తెరచుకున్నప్పటికీ...ఆశించినస్థాయిలో వినియోగదారుల నుంచి స్పందన లేదు. లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి సామాన్యుల వద్ద డబ్బుల కొరత ఏర్పడింది. ఈ ప్రభావం రంజాన్ మార్కెట్‌పై పడింది. లాక్‌డౌన్ సడలింపులతో ప్రజలు బయటకు వస్తున్నప్పటికీ... సాధారణ రోజుల్లో ఉన్నట్లుగా రద్దీగా కనపించడం లేదు. నిత్యం కిటకిటలాడే కూడళ్లు, సర్కిళ్ల వద్ద జనం పలచగా కనిపిస్తున్నారు.
జోష్ లేని వ్యాపారం
రంజాన్ మాసం అనగానే వస్త్రదుకాణాలలో సందడి కనిపిస్తుంటుంది. కానీ ఈసారి దుస్తుల కొనుగోళ్లపై చాలా మంది ఆసక్తి చూపడంలేదని కరీంనగర్‌లో వ్యాపారులు చెబుతున్నారు. పండ్ల కొనుగోళ్లు ఆశించినంతగా లేవని వాపోయారు. ఏటా జరిగే వ్యాపారంలో పదో శాతం కూడా జరగడంలేదని వ్యాపారులు అంటున్నారు.
విక్రయాల ప్రభావం
చిరు వ్యాపారులపైనా మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. లాక్‌డౌన్ నిబంధనలూ కొంత మేర గిరాకీ దెబ్బ తినడానికి కారణమైందని అంటున్నారు. ప్రధానంగా సాధారంగా రంజాన్ మాసంలో పండ్లు, ఖర్జూర దుకాణాలు ఎక్కువగా ఫుట్‌పాత్‌లపై వెలుస్తాయి. కొనుగోలుదారులు లేకపోవడంతో ఈ ఏడాది కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి. మరోవైపు పెరిగిన ధరలూ విక్రయాలపై ప్రభావం చూపిస్తోందని దుకాణ యజమానులు అభిప్రాయపడుతున్నారు.
లాక్‌డౌన్ నిబంధనల వల్ల ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకే దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఉంది. అయితే... పొద్దంతా ఎండ విపరీతంగా ఉండటంతో సాయంత్రం వేళ ప్రజలు బయటకు వస్తున్నారని.. ఆ సమయంలోనే దుకాణాలు మూసివేయడంతో విక్రయాలు ఆశించినంతగా లేవని కొందరు అంటున్నారు. రంజాన్‌కు ఇవాళ ఒక్కరోజే సమయం ఉన్నందున గిరాకీ పెరుగుతుందనే ఆశాభావంతో వ్యాపారులు ఉన్నారు.
ఇవీ చూడండి: 'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'