అదిగో.. ఇదిగో వీసీల నియామకం. అనేది ప్రకటనలకే పరిమితం అయింది. త్వరలోనే శాతవాహన విశ్వవిద్యాలయానికి ఉపకులపతి రానున్నారనేది కల్పితమే అయింది. ఆరేళ్లుగా ఉపకులపతి లేకుండా ఇన్‌ఛార్జిలతో నెట్టుకొస్తున్న వైనం. ప్రస్తుతం వీసీగా కొనసాగుతున్న టి.చిరంజీవులు ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్నారు. అంటే మరొక మారు పదవీ ఖాళీ కానుంది. మే 1 నుంచి పూర్తి స్థాయి ఉపకులపతి నియామకం అవుతారనే విశ్వాసం లేకుండా పోయింది. అంటే మళ్లీ ఇన్‌ఛార్జీయే. 2015 నుంచి పలువురు ఐఏఎస్ అధికారులు వీసీగా కొనసాగుతున్నారు. ఎప్పుడో అన్వేషణ కమిటీ వేసినా దాని ఫలితం కార్యరూపం దాల్చడం లేదు. వారం రోజుల్లో వీసీ కుర్చీ ఖాళీ కానున్న నేపథ్యంలో విషయం తెరపైకి వచ్చింది.
జనవరిలో గవర్నర్ సూచన
శాతవాహనతో పాటు రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల్లో వీసీలు లేరు. అక్కడ ఇన్‌ఛార్జిలే పని చేస్తున్నారు. శాశ్వత ఉపకులపతులను నియమించాలని జనవరి మాసంలో గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి సూచించింది. గతేడాది వీసీల నియామకం చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. సెర్చ్ కమిటీ ఏర్పాటు, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గతేడాది ముగిసింది. అంతకు ముందు విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పదవీ ముగియడంతో తిరిగి సెర్చ్ కమిటీలో చిత్రారాంచంద్రన్‌కు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే నియామకాలు జరుగుతాయని అంతా భావించారు. ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వానికి నివేదించారు. ఒకరిని ముఖ్యమంత్రి ఎంపిక చేయగానే గవర్నర్‌చే నియామకం జరగాల్సి ఉంది. అయితే వరుసగా ఉప ఎన్నికలు, కొవిడ్-19 పరిస్థితులతో వీసీల నియామకానికి బ్రేకు వేసింది.
మళ్లీ ఐఏఎస్‌కే అవకాశం
వీసీల నియామకం ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదని విశ్వవిద్యాలయం అధికారులు పేర్కొంటున్నారు. ఒక వర్సిటీ వీసీ పదవి ముగిస్తే నూతన నియామకం జరిగే వరకు పొరుగు విశ్వవిద్యాలయం వీసీలకు అదనపు బాధ్యత ఇస్తారు. గతంలో శాతవాహనకు కేయూ వీసీ, కాకతీయ విశ్వవిద్యాలయానికి ఎస్‌యూ వీసీలు బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు శాతవాహన వీసీ పదవీ విరమణ చేయనున్నారు. దీంతో పక్కనే ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయానికి పూర్తి స్థాయి వీసీ లేరు. అక్కడ ఐఏఎస్ అధికారి జనార్దన్‌రెడ్డి వీసీగా ఉన్నారు. గతంలో మాదిరిగా ఆయనకే బాధ్యత అప్పగించే అవకాశం లేక పోలేదు. పని భారం ఎక్కువ అవుతుందని భావిస్తే రాష్ట్రంలో ఏదైనా ఒక ఐఏఎస్‌ను శాతవాహనకు నియమించే అవకాశం ఉంది.
ఆరేళ్లలో ముగ్గురు
శాతవాహన విశ్వవిద్యాలయం 2008లో ఏర్పడింది. తొలి ఉపకులపతిగా ఆచార్య మహ్మద్ ఇక్భాల్ అలీ 2011 వరకు పని చేశారు. అనంతరం కేయూ వీసీ వెంకటరత్నం 2011 నుంచి 2012 వరకు ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏప్రిల్ 19, 2012 నుంచి ఆగస్టు 12, 2015 వరకు ఆచార్య కె.వీరారెడ్డి వీసీగా పూర్తి స్థాయిలో సేవలందించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఇన్‌ఛార్జిలే. డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి 2015 నుంచి 2017వరకు పని చేశారు. అయితే పని ఒత్తిడి కారణంగా ఆయన సేవలు హైదరాబాద్‌కు పరిమితం చేశారు. తర్వాత టి.చిరంజీవులు ఆగస్టు 28, 2017 నుంచి ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. వర్సిటీ తొలి స్నాతకోత్సవాన్ని చిరంజీవులు నిర్వహించారు. ఇప్పుడు ఆయన పదవీ విరమణ పొందనున్నారు. మరొక వీసీ కోసం శాతవాహన వేచి చూస్తోంది. అంతే కాదు రిజిస్ట్రార్ బాధ్యతలు కూడా ఇన్‌ఛార్జిగానే కొనసాగుతున్నాయి. వర్సిటీ ఆచార్య టి.భరత్ పరీక్షల నియంత్రణాధికారిగా, ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్నారు.
ఇదీ చదవండి: వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి