కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసినా.. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన కరీంనగర్ జిల్లాలోని వన్నారం, చొప్పదండి మండలం వెదురు గట్ట, గంగాధర మండలం గట్టు భూత్కూర్లలో కట్టుదిట్టమైన భద్రత కల్పించడం వల్ల ఓటింగ్ ప్రశాంతంగా సాగింది.
ఓటు హక్కు వినియోగం
కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ జిల్లాలోని కశ్మీర్ గడ్డ యునైటెడ్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. భాజపా అభ్యర్థి బండి సంజయ్ సాధన స్కూల్లో ఓటేశారు. తిమ్మాపూర్ మండలంలోని అల్గునూరులో నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు చేశామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి. కమలాసన్ రెడ్డి చెప్పారు. నగరపాలక సంస్థలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రంలో ఓటేసిన ఆయన.. ప్రజలందరూ ఓటింగ్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
మొరాయించిన ఈవీఎంలు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముకరంపుర 154 పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. గంటపాటు ఓటర్లు క్యూలైన్లలో నిల్చొనే పరిస్థితి ఏర్పడింది. ఓటు వేసేందుకు మహిళలు, పురుషులు ఆసక్తిగా ఉన్న సమయంలో ఈవీఎంల మొరాయింపు నిరాశకు గురిచేసింది. అయినా అధికారులు స్పందించకపోవడం వల్ల కొంతమంది ఓటు వేయకనే వెళ్లిపోయారు. ఆలస్యంగా వచ్చిన అధికారులు ఈవీఎంలను సరిచేసినా లాభం లేకపోయింది.
బహిష్కరణ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పల్లి గ్రామంలో లోక్ సభ ఎన్నికలను గ్రామస్థులు బహిష్కరించారు. వేములవాడ పురపాలక సంఘం విలీనంలో వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామం మున్సిపాలిటీకి దూరంగా ఉందని ఉపాధి పనులు కూడా కోల్పోవాల్సి వస్తుందని నిరసన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: 'ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి'