కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం హబ్, స్పోక్ మోడల్‌ను జిల్లా కలెక్టర్ కె.శశాంక సందర్శించారు. జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కనుమల్ల విజయతో కలిసి పరిశీలించారు.
జిల్లాలోని పేదలకు 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేసేందుకు వీలుగా.. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం హబ్, స్పోక్ మోడల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం 42 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షుగర్, థైరాయిడ్, మూత్రపిండాల పనితీరు పరీక్షలు, కాలేయ పరీక్షలు, మూత్ర పరీక్షలు మొదలగునవి ఉచితంగా నిర్వహిస్తారని వివరించారు.
ఈ రోగ నిర్ధారణ కేంద్రంలో ప్రస్తుతం డ్రైరన్ నిర్వహిస్తున్నామని.. త్వరలోనే సేవలను అందుబాటులోకి తెస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగుల నుంచి నమూనాలు సేకరించి.. పంపేందుకు లక్ష్యాలను నిర్దేశించాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిని ఆదేశించారు.
ఈ రోగ నిర్ధారణ కేంద్రానికి ప్రత్యేకంగా జనరేటర్, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో.. నిర్వహణ పకడ్బందీగా కొనసాగించాలన్నారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం పక్కన స్కానింగ్ సెంటర్, రేడియాలజీ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు. అనంతరం ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన సేవ పరీక్ష గదిని ఆయన పరిశీలించారు.