రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే ముఖ్య ఉద్దేశంతో, రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించడానికి ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ నిర్మాణం సిద్ధమవుతోంది. కేటీఆర్ ఆలోచనకు అనువుగా తెలంగాణ మోటార్ వెహికిల్స్ అసోసియేషన్ సభ్యులందరూ ఆర్థికసాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని రవాణాశాఖ కార్యాలయ ప్రాంగణంలో పార్క్ నిర్మించాలని నిర్ణయించారు. దాదాపు రెండెకరాల స్థలంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ట్రాఫిక్ చిహ్నాల ఏర్పాటు
బస్సుల్లో నుంచి ప్రాంగణంలోకి దిగిన వెంటనే ఫుట్‌పాత్ మీదుగా ఆడిటోరియంకు చేరుకొనేలా ఏర్పాట్లు చేశారు. నిజజీవితంలో రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ఎదురయ్యే ట్రాఫిక్ చిహ్నాలకు సంబంధించి అన్నిఏర్పాట్లు ఈ పార్కులో చేస్తున్నారు. వీటితో పాటు పెట్రోల్ బంక్, పాఠశాల భవనం, ఆసుపత్రి, కూరగాయల మార్కెట్, పార్కింగ్ వంటి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు.
ప్రాక్టికల్ అవగాహన
ఏకకాలంలో 200 మంది విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఆడిటోరియంతో పాటు పలు వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ గురించిన పాఠ్యాంశాలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బోధిస్తారు. అనంతరం అందుబాటులో ఉన్న సైకిళ్లపై హెల్మెట్ ధరించి ప్రాక్టికల్స్‌కు బయలుదేరే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యత, పాదచారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలకు కారణాలు, ట్రాఫిక్ అధికారుల విధులు, జరిమానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.
ఇవీ చూడండి: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: గవర్నర్