కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భాజపా కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు పరిశీలించారు. అక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద మిల్లర్లు, అధికారుల జాప్యం వల్లనే రైతులు 30 రోజులుగా పడిగాపులు కాస్తున్నారన్నారు. పంటలు పండించే విషయంలో రైతులకు పూర్తి స్వేచ్ఛను కల్పించి రైతుబంధు పెట్టుబడి సాయం వంటి వాటిపై షరతులు విధించకూడదని సీఎంను కోరారు.
పంజాబ్, హరియాణా రాష్ట్రాలు రికార్డు..
రైతు సంస్కరణలకు తాము వ్యతిరేకం కాదని.. కానీ రైతులపై బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమన్నారు. ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని.. తెలంగాణ కంటే పంజాబ్, హరియాణా రాష్ట్రాలు రికార్డు స్థాయిలో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించినట్లు సుగుణాకర్ వెల్లడించారు. సన్నరకం ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.2,500ల మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రధానమంత్రి మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు.
ఇదీ చూడండి: వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష