BJP Maha Jan Sampark Abhiyan in Telangana : కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో బీజేపీ డీలా పడింది. ఊపు మీద ఉన్న కాషాయదళం ఒక్కసారిగా నిస్తేజంలోకి వెళ్లిపోయింది. నేతల మధ్య విభేదాలు, బహిరంగంగా చేసిన వ్యాఖ్యలతో పార్టీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్నికల ముంగిట కార్యక్రమాల నిర్వహణ లేక పార్టీలో నెలకొన్న స్తబ్ధత తీవ్ర నష్టం చేస్తోందని గ్రహించిన జాతీయ నాయకత్వం అప్రమత్తమైంది. శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపేందుకు 'మహా జన్ సంపర్క్ అభియాన్' పేరుతో ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఇవాళ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జిల్లాలోని బద్దిపల్లిలో కార్యకర్తలతో కలిసి 'టిఫిన్ బైటక్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్... అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
Bandi Sanjay fires on CM KCR : కేసీఆర్.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ధరణి మంచి పథకమే కానీ.. అది కేసీఆర్ కుటుంబానికే ఆసరాగా మారిందని ధ్వజమెత్తారు. ధరణిలో మార్పులు చేసి కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలు రాబోతున్నాయని.. గెలుస్తామని కాంగ్రెస్ కలలు కంటోందని బండి సంజయ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యక్తుల మీద ఆధారపడే పార్టీ కాదని పేర్కొన్నారు. బీజేపీ సింబల్ మీద పోటీ చేస్తే గెలిచే విధంగా పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు.
'కేసీఆర్ సర్కార్‌లోని మంచి పథకాలు కొనసాగిస్తాం. ధరణిలో మార్పులు చేసి కొనసాగిస్తాం. కాంగ్రెస్‌లో గెలిచిన వారు బీఆర్ఎస్లో చేరతారు. కాంగ్రెస్‌లో 30 సీట్లను నిర్ణయించేది కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదు. తెలంగాణకు రూ.ఐదు లక్షల కోట్లు ఇచ్చాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చారు.. వాటిలో ఎన్ని నెరవేర్చారు? రెండు నెలల నుంచి పింఛన్లు ఇస్తలేరు. ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో కేసీఆర్ సర్కార్ ఉంది. అభివృద్ధి నిధులపై సీఎం కేసీఆర్ చర్చకు వస్తారా ? కేసీఆర్.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.'-బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తే కేసీఆర్‌కు వణుకు : హోం మంత్రి మహమూద్ అలీ ఉగ్రవాదులు వచ్చినప్పుడు స్పందించలేదన్న బండి సంజయ్.. కిడ్నాప్‌లు, మహిళలపై దాడులు జరుగుతుంటే ఆయన ఎక్కడికిపోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామని కలలు కంటుందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసుకున్న సర్వేలో నలభై సీట్లు రావడం లేదన్న సంజయ్.. ఆ పార్టీని కేసీఆర్ లేపాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తే కేసీఆర్‌కు వణుకు పుడుతుందన్నారు. అలాగే బీజేపీ నుంచి ఎవరూ బయటికి వెళ్లరని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి :