దళిత బంధు తరహా పథకం రాష్ట్రమంతా అమలు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో భాజపా నేత ఈటల రాజేందర్ పాదయాత్ర ఆరో రోజు కొనసాగుతుండగా.. బండి సంజయ్ హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా చిన్నకోమటిపల్లి నుంచి ప్రజాదీవెన యాత్ర ప్రారంభించారు. ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత నడక మొదలు పెట్టారు. చిన్నకోమటిపల్లి గ్రామస్థులు ఈటలకు మంగళ హారతులతో ఆహ్వానం పలికి.. సంఘీభావం తెలిపారు. తెరాస బీ-ఫాంతోనే తాను గెలిస్తే... మిగతా వాళ్లు ఎందుకు ఓడిపోయారని ఈటల ప్రశ్నించారు.
నీ బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయినవు..
ఉద్యమంలో పేరొచ్చింది.. ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పేరొస్తుందని భావించి.. ఈయన పేరు చెరిపేస్తే చెరిగిపోయేలా కనిపిస్తలేదని కుట్రపన్ని నన్ను మంత్రివర్గం నుంచి తొలగించిండు. మనుషుల్ని కొనుక్కో అని స్టేట్మెంట్లు ఇచ్చే నీచానికి దిగజారిండు. తెరాస బి.ఫాం ఇస్తే గెలిచిండు అంటున్నరు... మరీ అదే బి-ఫాం, అదే జెండా, అదే బొమ్మ, అదే మనిషివి... నీ బిడ్డ కవితను ఎందుకు గెలిపించుకోలేకపోయినవు. ఈ పరిపాలన కొనసాగడం ఈ రాష్ట్రానికి అరిష్టమని ప్రజలు భావిస్తున్నరు. నీ డబ్బులకు కాలం చెల్లిపోయిందని చెంప మీద కొట్టే ఎన్నిక ఈ ఎన్నిక. ఆరుసార్లు గెలిచినా నేను ధర్మంగానే గెలిచా. నాకు కుడి, ఎడమ ఎవరూ ఉండకూడదని చూస్తున్నారు. మీరు డబ్బు, అధికారాన్ని నమ్ముకుంటే.. నేను ప్రజలను నమ్ముకున్నా. 2023లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరబోతోంది. -ఈటల రాజేందర్, మాజీ మంత్రి, భాజపా నేత
ఊరుకునేదే లేదు..
ఏ ఎన్నికలొచ్చినా వచ్చి హామీలివ్వడం కేసీఆర్‌కు అలవాటు. దళితబంధు కొందరికే ఇచ్చి మోసం చేసే కుట్ర చేస్తున్నారు. అందరికి ఇచ్చేవరకు ఊరుకునేనది లేదు. రూ.10 లక్షలు అన్ని వర్గాల పేదలకు ఇవ్వాలి.. ఇచ్చేవరకు భాజపా కొట్లాడుతుంది. భాజపా అధికారంలోకి వచ్చాక భాగ్యనగరం నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం పెడతాం. -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి: Kodandaram: 'రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోంది'