Bandi Sanjay Arrest Updates : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై భాజపా లీగల్ సెల్ అభ్యంతరం తెలిపింది. ఇరువర్గాల వాదనలు విని న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు.
ఏం జరిగిందంటే..
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం విడుదల చేసిన.. జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ భాజపా చేపట్టిన జాగరణ దీక్షను.. పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం రాత్రి కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయం వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన దీక్షకు అనుమతిలేదని పోలీసులు అడ్డుకున్నారు. ఆంక్షలను తప్పించుకొని.. కార్యాలయంలోకి వెళ్లి సంజయ్ దీక్ష చేపట్టగా, పోలీసులు తలుపులు పగులగొట్టి.. ఆయణ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, భాజపా కార్యకర్తల మధ్య.. తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.
కోర్టుకు సంజయ్..
అదుపులో ఉన్న బండి సంజయ్‌ను పోలీసులు ఈ రోజు ఉదయం కరీంనగర్‌లోని కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించడంతో భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీపీ సత్యనారాయణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బండి సంజయ్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఎంపీ బండి సంజయ్‌ని కరీంనగర్ కోర్టుకు తరలించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం జైలుకైనా వెళ్తానని.. ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమని.. ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. శాంతియుతంగా చేస్తున్న జాగరణ దీక్షను.. అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
60 మందికి నోటీసులు..
'మాస్కులు ధరించని 25 మందిపై కేసు నమోదు చేశాం. 16 మందిపై విపత్తు సెక్షన్ల కింద కేసు పెట్టాము. బండి సంజయ్‌పై కూడా కేసు నమోదు చేశాం. ఇప్పటి వరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం. 60 మందిని విడుదల చేసి నోటీసులు ఇచ్చాం. సభలు, సమావేశాలకు ఇకపై అనుమతులు ఇవ్వబోం.'
-సీపీ సత్యనారాయణ
ఇదీ చూడండి: Bandi Sanjay Arrest: బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం.. అరెస్ట్ చేసిన పోలీసులు