ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు ఏంటి?
కరీంనగర్లో ఒకేసారి 8 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మమ్మల్ని అప్రమత్తం చేశారు. జిల్లాకు పంపించారు. కొన్ని కఠిన నిబంధనలు అమలు చేశాం. ఇండోనేషియా వాళ్లు తిరిగిన ప్రదేశాల్లోని ప్రజలను స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరాం. వాళ్లంతా సహకరించారు. ఇప్పుడు రెండు యాక్టివ్ పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. మే 7 వరకు ఇలాగే లాక్‌డౌన్‌ను పాటిస్తే కరీంనగర్ కరోనా ఫ్రీ జోన్ అవుతుంది.
ఈ రోజు నుంచి రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లింలకు మీరు ఎలాంటి సూచనలు చేశారు?
రంజాన్ మాసం మొత్తం ఇంటికే పరిమితమై నమాజ్ చేసుకోవాలని ముస్లింలను కోరాం. ఇలా చేయడం వల్ల వైరస్ వ్యాప్తి జరగదని సూచించాం.
లాక్డౌన్ నుంచి పండ్ల దుకాణాలకు మినహాయింపు ఇచ్చారా?
పండ్లు ఇళ్ల వద్దకే వచ్చేలా చర్యలు తీసుకుంటాం. అధికారులతో చర్చించి ఏర్పాట్లు చేస్తాం.
పంట కొనుగోళ్లపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు. కొన్ని చోట్ల పంట తగులబెట్టుతున్నారు. దీనికి కారణాలు ఏంటి?
పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. కరోనా ప్రభావం ఉన్నా కూడా పంట కొనుగోలుకు ఇబ్బంది ఉండకూడదని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పంట కొనుగోలు కేంద్రాలను కూడా పెంచాం. పంటను తగులబెట్టవద్దు.
తాలు అధికంగా ఉందని పంట కొనుగోలు చేయట్లేదు. అలాంటి కఠిన నిబంధనలు అమలు చేయడానికి కారణం ఏంటి?
ఈ నిబంధనలు పెట్టింది ఎఫ్‌సీఐ. ఇది కేంద్ర ప్రభుత్వం అధీనంలోని సంస్థ. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సడలింపులు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర భాజపా నేతలు కోరాలి. తాలు ఉన్నా... పంట కొనుగోలు చేయాలని రైస్ మిల్లర్లను కోరాం. నష్టం వస్తే ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పాం.
ఇదీ చదవండి: ఈ వస్త్రాలతో చేసిన మాస్కులతోనే వైరస్‌కు బ్రేక్!