Kamareddy student stuck in Ukraine: ఉక్రెయిన్‌లో కామారెడ్డి జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని చిక్కుకుంది. బీబీపేట్‌కు చెందిన బచ్చు చంద్రశేఖర్, భైరవీ దేవిల కుమార్తె హరిప్రియ.. ఆ దేశంలో ఖర్కీవ్ నగరంలోని నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. ఉక్రెయిన్‌పై నాలుగు రోజులుగా రష్యా బాంబు దాడులతో.. దేశమంతా భయాందోళనల నడుమ బతుకుతోంది. ఈ క్రమంలో ఆ దేశంలో ఉన్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి క్షేమంగా తరలించేందుకు.. భారత్ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తోంది. కానీ ఇతర దేశాల సరిహద్దులకు 1500 కి.మీ.ల దూరంలో ఉండటంతో తమ పరిస్థితి ఏంటోనని హరిప్రియ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అండర్ గ్రౌండ్‌లోనే జీవనం
ఉక్రెయిన్- రష్యా సరిహద్దుకు 30 కి.మీ.ల దూరంలో ఖర్కీవ్ నగరం ఉంది. భారత్‌కు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి విద్యార్థులను తరలిస్తుండగా.. ఖర్కీవ్ నగరంలో ఉన్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పోలాండ్, హర్మేనియా దేశాల సరిహద్దుకు 1500 కి.మీ.ల దూరంలో వీరంతా ఉన్నారు. వీరిని తరలించేందుకు భారత రాయబార కార్యాలయం ఇంకా చర్యలు చేపట్టకపోవడంతో.. దిక్కు తోచని స్థితిలో మూడు రోజుల నుంచీ మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్లో తలదాచుకున్నారు. మిగిలిన భారతీయులతో కలిసి హరిప్రియ ఆశ్రయం పొందుతోంది. నిన్నటి నుంచి బాంబు దాడులతో భయాందోళనకు గురవుతున్నామని.. తమను భారత్‌కు తరలించాలని హరిప్రియ విజ్ఞప్తి చేస్తోంది.
అవస్థలు పడుతున్నాం
'ఖర్కీవ్‌లో నేను మెడిసిస్ మూడో సంవత్సరం చదువుతున్నాను. మూడు రోజులుగా మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్‌లోనే గడుపుతున్నాం. ఇప్పటి వరకూ ఇండియన్ ఎంబసీ నుంచి మాకు ఎలాంటి సమాచారం రాలేదు. ఇక్కడ తినడానికి ఏమీ లేక అవస్థలు పడుతున్నాం. ఎలాగైనా మమ్మల్ని భారత్‌కు తరలించాలి.' - హరిప్రియ
మా బిడ్డను క్షేమంగా తీసుకురండి
మరో వైపు ఉక్రెయిన్‌లో హరిప్రియ పరిస్థితిపై.. ఇక్కడ ఆమె తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరిప్రియ ఉన్న ప్రాంతం నుంచి ఇతర దేశాల సరిహద్దుకు వెళ్లాలంటే 1500 కి.మీలు ప్రయాణం చేయాలని తెలిపారు. కానీ అంతదూరం వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేదని.. తమ కుమార్తెను ఎలాగైనా రాష్ట్రానికి తరలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'పౌరులను తరలించడం కుదరదు.. అక్కడే ఉండండి': చైనా