కామారెడ్డి జిల్లాలో పంట చేతికొచ్చి మూడు నెలలు గడిచినా.. జొన్న రైతులు అమ్ముకోలేకపోతున్న దీనస్థితి నెలకొంది. జిల్లాలో వ్యవసాయాధికారుల నివేదిక ప్రకారం 16,571 మంది రైతులు.. లక్షా 24 వేల 204 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. 5 ,56,698 క్వింటాళ్లు దిగుబడి ఉంటుందని అంచనా వేశారు. ఒక ఎకరానికి పెట్టుబడి ఖర్చులకు రూ.20 వేల వరకు రైతులు వెచ్చించారు. ఒక ఎకరానికి 22-25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కేంద్రం ఎంఎస్పీ ప్రకారం క్వింటాకు రూ.2,970గా ధర ఉంది. ఈ పంట కొనుగోళ్లు పూర్తయితే తప్ప రైతులు వానాకాలం పంటలు వేసుకునేందుకు.. పెట్టుబడి పైసలు లేని దుస్థితిలో ఉన్నారు.
మాట విన్నందుకు ఉరా..? యాసంగిలో వరి సాగు చేయొద్దని.. వరి వేస్తే ఉరేనని గ్రామాల్లో వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. ధాన్యం ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయమని తెగేసి చెప్పారు. వీరి మాట విని జొన్న పంటను సాగు చేసిన రైతులు.. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం చెప్పినా వినకుండా వరి పండించిన రైతుల ధాన్యం కొనుగోలు చేసి.. సొమ్ము వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రభుత్వం, అధికారుల మాట విని ఆరుతడి పంట సాగు చేస్తే.. ఆ రైతులను మాత్రం సర్కారు పట్టించుకోకపోవడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాస్తారోకో చేసినా ఫలితం శూన్యం.. 3 నెలల కిందట జొన్న పంట చేతికొచ్చింది. గ్రామాల సమీపంలో కుప్పలుగా పంటను పోశారు. పిట్లం మండలం రాంపూర్‌లో వంద మందికి పైగా రైతులు ఏకంగా 200 ఎకరాలకు పైగా జొన్న పంట సాగు చేశారు. పంట చేతికొచ్చినా కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో పంట తడిచిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుప్పలపై సంచులను కప్పినా వర్షానికి.. తడిసి మొలకలు వస్తున్నాయని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పిట్లం, రాజంపేట మండలాల్లో ఈ నెల 13న రైతులు రాస్తారోకో చేశారు. జొన్న కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అయినా ఎవరూ స్పందించలేదని నిరుత్సాహం చెందుతున్నారు. ఇప్పటికైనా కొనకపోతే తీవ్ర ఆందోళన చేపడతామని అంటున్నారు.
పంట అమ్మితేనే.. పెట్టుబడికి పైసలు.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. జొన్నలు కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వానాకాలం పంటలు వేసుకునేందుకు జొన్నల అమ్మకం అడ్డంకిగా మారిందని.. పంట అమ్మితేనే పెట్టుబడికి డబ్బులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి..