Sale of fake railway tickets in Kamareddy: మోసం.. ఈ రోజుల్లో పరిపాటిగా మారింది. మంచి మాటలతో పరిచయం చేసుకుని.. చివరికి తేనె పూసిన కత్తిలా గొంతు కోస్తున్నారు. తమతో పాటుగా రైల్వే టికెట్లను కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తి మాటలు కలిపి కస్టమ్స్ కోటాలో అంటూ నకిలీ రైల్వే టికెట్లను విక్రయించిన ఘటన కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో బయట పడింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన రాజు అనే వ్యక్తి .. తమ కుటుంబ సభ్యులకు కామారెడ్డి నుంచి హిందూపూర్ వెళ్లేందుకు రైలు టికెట్లు బుక్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. బుకింగ్ కౌంటర్ వద్ద తత్కాల్ బుకింగ్ కోసం క్యూలో నిలబడ్డాడు. అదే క్యూలో ఉన్న విజయ్ అనే వ్యక్తి కస్టమ్స్ కోటాలో టికెట్లు బుక్ చేస్తానని రాజుకు తెలిపాడు. తన చెల్లెలు, భార్య ఇదే రైలులో కడపకు వెళుతున్నారని నమ్మించాడు.
కామారెడ్డి నుంచి హిందూపూర్‌కు ఎనిమిది టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసి విజయ్ ఫోన్లో నుంచి రాజుకు టికెట్లను పంపించాడు. తాను దిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తానని చెప్పడంతో.. రాజు నమ్మి సదరు వ్యక్తికి 3500 రూపాయల డబ్బులు ఇచ్చాడు. శనివారం ఎనిమిది మంది మహిళలు ఆ టికెట్లు తీసుకొని రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో కూర్చున్నారు. టీసీ వచ్చి వాటిని పరిశీలించగా నకిలీ టికెట్లని తేలింది. దీంతో వారిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు నుంచి కిందికి దింపారు. సదరు టికెట్లు ఇచ్చిన వ్యక్తికి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోంది. బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
"మా కుటుంబ సభ్యులకు హిందూపూర్ వెళ్లడానికి రైలు టికెట్లు కొనుగోలు చేయడానికి ఉదయం కామారెడ్డి రైల్వే స్టేషన్‌కు వచ్చాం. మాతో పాటుగా క్యూలో నిల్చున్న గుర్తు తెలియని వ్యక్తి.. దిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నానంటూ చెప్పి.. తత్కాల్‌లో టికెట్లు ఇప్పుడు లభించవని కస్టమ్స్ కోటాలో టికెట్లను ఇస్తానని నకిలీ టికెట్లను విక్రయించాడు. టీసీ చెక్ చేస్తే అవి నకిలీవని తేలడంతో మావాళ్లు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రైలు దిగాల్సి వచ్చింది. అందరూ మహిళలే ఉన్నారు. వారి వద్ద హిందూపూర్ వెళ్లడానికి డబ్బులు లేవు. సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాము". - రాజు, బాధితుడు
ఇవీ చదవండి: