కరోనా ప్రభావంపై కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో వైద్యారోగ్య శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులతో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాక్సినేషన్లో రాష్ట్రంలోనే జిల్లా మొదటిస్థానంలో ఉందని మంత్రి తెలిపారు. కరోనాకు సంబంధించి టెస్టుల సంఖ్య పెంచడంతో పాటు పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స, వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం.. వ్యాక్సినేషన్ ప్రక్రియ కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. కొవిడ్ టెస్టులు చేయడంలో జిల్లా అధికారులు ముందంజలో ఉన్నారని కొనియాడారు. 2 రోజుల్లో ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను 140కి పెంచుతామన్న ప్రశాంత్‌రెడ్డి... మందులు, టీకాల కొరత లేకుండా చూస్తామన్నారు. జిల్లా ఆస్పత్రిలో 40, బాన్సువాడలో 50, దోమకొండ, మద్నూర్, ఎల్లారెడ్డి ఆస్పత్రుల్లో 10 చొప్పున ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.
తాత్కాలిక నియామకాలు..
జిల్లాలో 2లక్షల 30వేల టీకాలు ఇవ్వాలని లక్ష్యం ఉంటే ఇప్పటికే లక్షకు పైగా మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసి.. 44 శాతంతో రాష్ట్రంలోనే కామారెడ్డి మొదటి స్థానంలో ఉందని మంత్రి వివరించారు. టీకా పంపిణీకి కావాల్సిన సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. మహారాష్ట్ర నుంచి జిల్లాకు రాకపోకలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలంతా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: కరోనా కట్టడికి పల్లెవాసుల శ్రమ.. భౌతికదూరం పాటించేలా చర్యలు