Lovers suicide in Pitlam mandal Kamareddy : జీవితంలో కలిసి నడవాలి అనుకున్న వారికి కులాలు అడ్డుకాలేదు. వారి ప్రేమ ముందు కులాలు చిన్నబోయాయి. చివరికి పెద్దలను ఎదురించి మరి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంటి దగ్గర తల్లిదండ్రులను, ఊర్లో పెద్దలను ఎదురించిన వారు.. జీవితంలో వచ్చిన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొలేకపోయారు. చివరికి చావులో కూడా మేము వేరు కాదంటూ ఒకే తాడుతో ఒకే ఉరి కొయ్యకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాధ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
- రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
- 'నువ్వు లేక నేను లేను' అంటూ భర్త చెంతకు..
పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బొల్లక్పల్లికి చెందిన ఉప్పరి సంతోష్(21), బాన్సువాడ మండలం ధర్మల్ గుట్టకు చెందిన కవిత (19) ఇరువురు గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వారి ప్రేమ వ్యవహారాన్ని ఇంటి దగ్గర పెద్దలకు చెప్పారు. ఇరువురి సామాజిక వర్గాలు వేర్వేరు కావడంతో ఇంటి దగ్గర వాళ్లు అంగీకరించలేదు. ఈ తరుణంలో వారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేశారు.
Lovers commit suicide due to financial problems : ఎంతకీ వారు అంగీకరించకపోవడంతో చివరికి ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఆరు నెలల క్రితం రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొన్ని రోజులు వారి జీవితం సాఫీగా సాగింది. ఆ తరువాత ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఏం చేయాలో తెలియడం లేదు. చేయడానికి పని లేదు.. ఇంట్లో కూర్చుంటే రోజు గడవని పరిస్థితి. ఈ తరుణంలో తెలిసిన వారిని స్నేహితులను ఆశ్రయించారు. వారి నుంచి సహాయం ఆగిపోయింది. ఇంటి దగ్గర పెద్దలను ఎదిరించి వివాహం చేసుకోవడంతో వారి నుంచి సాయం పొందడానికి అవకాశం లేకపోయింది.
చిన్న చిన్న పనులు చేసి జీవితం సాగిద్దామంటే ఉపాధి కరవైపోయింది. చివరికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆత్మహత్యే శరణ్యం అనుకున్నారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మృతదేహాలను దించి శవపరీక్ష నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు.
దీనిపై స్పందించిన పోలీసులు ఆర్ధిక ఇబ్బందులతోనే ఇరువురు మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇంటి దగ్గర పెద్దల నుంచి అమ్మాయి లేదా అబ్బాయికి ఎమైనా ఒత్తిడి ఎదురైందా..? అనే కోణంలో సైతం విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరిన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో వరుసగా నెలకొంటున్న ఆత్మహత్యలు మరింత కలచివేస్తున్నాయి. సరైన అవగాహన లేకపోవడం.. ఇంటి దగ్గర పెద్దలను ఎదిరించి పెళ్లిళ్లు చేసుకోవడం. తీరా ఆర్ధిక ఇబ్బందులతో బాధపడటం జరుగుతున్నాయి. దీంతో జీవితాంతం కలిసి బతకాల్సిన ప్రేమికులు మధ్యలోనే తనువు చాలిస్తున్నారు.
ఇవీ చదవండి: