Kamareddy Migrant Workers Stuck in Malaysia : ఉపాధి కోసం విదేశీ బాట పట్టిన తొలి అడుగులోనే వారు మోసపోయారు. పక్కాగా పనుందని, ఆకర్షణీయమైన వేతనం ఇస్తారని ప్రముఖమైన కంపెనీలో ఉద్యోగం వస్తుందని ఏజెంట్లు నమ్మబలికారు. వారి మాయ మాటలను నమ్మి కామారెడ్డి జిల్లాకు చెందిన సుమారు 21 మంది.. రెండు నెలలక్రితం మలేషియా విమానమెక్కారు. విమానం దిగేలోపే వారి ఆనందం ఆవిరైపోయింది. తాము వెళ్లింది పనికోసం కాదని.. అమ్మకానికి అని తెలిసి ఒక్కసారిగా బోరున విలపించారు.
Kamareddy Victims in Malaysia : కామారెడ్డి జిల్లాకు చెందిన సుమారు 21 మంది ఉపాధి అవకాశాల కోసం మలేషియాకు వెళ్లారు. కామారెడ్డిలోని పాండియన్, రామలింగం అనే ఏజెంట్ల ద్వారా వాళ్లు.. ఒక్కొక్కరు రూ.1,50,000లు కట్టి కంపెనీ వీసా పేరుతో పనిలోకి కుదిరారు. కానీ.. అక్కడకు వెళ్లిన తర్వాత అసలు విషయం బయటపడింది. తమ ఏజెంటు చెప్పిన కంపెనీ మలేషియాలోనే లేదని, తాము మోసపోయామని తెలుసుకున్నారు.
Fake Visa Kamareddy Victims in Malaysia : పాండియన్, రామలింగం అనే ఏజెంట్లు.. మలేషియాలో కొత్త కంపెనీ ఏర్పాటయ్యిందని.. అందులో ఉద్యోగాలు కల్పిస్తామని, మంచి జీతాలు వస్తాయని నమ్మబలికారని బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమను వస్తువుల మాదిరి.. కాంట్రాక్టు లేబర్‌గా అమ్మేశారని తెలుసుకుని బోరున విలపించారు. రెండు నెలలుగా జీతం లేకుండా.. తమను అప్పగించిన కాంట్రాక్టరు వద్ద పనిచేస్తున్నామని తెలిపారు.
జీతం లేదు.. పని మాత్రం చేస్తున్నామని దేశం కానీ దేశంలో అవస్థలు పడుతున్నామని కామారెడ్డి వాసులు వేడుకుంటున్నారు. ఒక్కగదిలోనే తామంతా ఉంటున్నామని పేర్కొన్నారు. పడుకునేందుకు కూడా సరైన బట్టలు లేక టవల్స్‌తో సరిపెట్టుకోవాల్సి వస్తుందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాము తిరిగివస్తామని.. కామారెడ్డిలో ఉన్న ఏజెంట్లకు, మలేషియాలో ఉన్న ఏజెంట్లకు చెప్పినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.
ఎలాగైనా తమను స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు. తమ పాస్‌పోర్టులు జప్తు చేశారని బాధితులు.. ఎంపీ బీబీపాటీల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని విదేశి వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి, మలేషియాలోని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. తమను భారతదేశానికి తిరిగి తీసుకురావాలని వేడుకుంటున్నారు.
"ఉపాధి కోసం మలేషియా వచ్చి మోసపోయాం. రామలింగం, పాండియన్ అనే ఇద్దరు ఏజెంట్లు.. డబ్బులు తీసుకుని మలేషియాలో కంపెనీ వీసా మీద పని పేరుతో మోసం చేశారు. ఇక్కడ మమ్మల్ని కాంట్రాక్ట్ లేబర్‌గా మార్చి.. జీతాలు ఇవ్వకుండా పని చేయించుకుంటున్నారు. సమయానికి తిండి కూడా పెట్టడం లేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. స్వదేశానికి తిరిగి తీసుకురావాలి". - బాధితుడు
గల్ఫ్ బాధితుని దుర్భర జీవితానికి విముక్తి.. 21 ఏళ్లకు స్వస్థలానికి..
గల్ఫ్ వెళ్లి చేతులు కాల్చుకున్నాడు.. ఒక్క ఐడియాతో జీవితాన్నే మార్చేసుకున్నాడు..!