గోదావరి నదిపై గతంలో మొదలుపెట్టి, పూర్తి చేయని ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ గోదావరి జలదీక్షలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలోని చెరువును నియోజకవర్గ ఇంఛార్జి వడ్డెపల్లి సుభాశ్ రెడ్డి సందర్శించారు. కాళేశ్వరం 21, 22, 23 ప్యాకేజీలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
తెరాస ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట వేలకోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు. అంకెల గారడీ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగునీటి కోసం ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి రూపొందించిన 22వ ప్యాకేజీని ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.