కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన సాయిలు, కమలమ్మలకు ఇద్దరు కూతుళ్లు మౌనిక, లత. కామారెడ్డి మండలం తిమ్మక్ పల్లి గ్రామానికి చెందిన భూపాల్తో 2015 మార్చ్ 16న మొదట లతతో వివాహం జరిపించారు. ఈ క్రమంలో లతకు పాప కూడా జన్మించింది. లత మూగ కావడం వల్ల రెండో అమ్మాయి మౌనికనూ మేనల్లుడు అయిన భూపాల్కే ఇచ్చి పెళ్లి చేశారు.
కట్టుకున్నోడే కాలయముడు...
ప్రస్తుతం ఆమె ప్రస్తుతం గర్భవతి. తాగుడుకు బానిసైన భూపాల్ పనిపాట లేకుండా జులాయిగా తిరిగేవాడు. భూపాల్ ఏ పని చేయట్లేదని ఈ నెల 15న తూనికాకు సేకరణకు వెళ్దామని భూపాల్ను మౌనిక అడిగింది. కోపంతో రగిలిపోయిన భూపాల్ మౌనికను చితకబాదాడు. రెండు మూడు సార్లు ఎత్తి కుదేశాడు. అప్పటికే రుతు చక్రంలో ఉన్న మౌనికకు భర్త భూపాల్ కొట్టిన దెబ్బలకు తీవ్ర రక్తస్రావం అయింది.
ఎవరికి తేలియకుండానే...
హుటాహుటిన మౌనికను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్కు తరలించాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో మౌనిక హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. మౌనిక అంత్యక్రియలను ఆఘమేఘాల మీద ఎవరికీ తెలియకుండా పూర్తి చేశాడు భర్త భూపాల్. అనుమానం వచ్చిన మౌనిక తల్లిదండ్రులు దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ అల్లుడి దెబ్బలకే కూతురు మరణించిందని..బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ తేజాస్ నందన్ లాల్ పవార్, డీఎస్పీ లక్ష్మీనారాయణ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక వచ్చిన తర్వాత దాని ప్రకారం కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.