Kamareddy Municipal Master Plan dispute : కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనను తాత్కాలికంగా విరమించి ఇళ్లకు వెళ్లారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టిన అన్నదాతలు.. దిష్టిబొమ్మకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నేడు కామారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. నేటి నుంచి ఆందోళన ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు. దాదాపు 8 గంటలపాటు కలెక్టరేట్ ముందు అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు.
ఈ మాస్టర్ ప్లాన్ గొడవ ఏంటంటే?: ప్రభుత్వ ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్‌ను దిల్లీకి చెందిన ఓ సంస్థతో ఇటీవల తయారు చేయించారు. కామారెడ్డి పట్టణంతో పాటు విలీన గ్రామాలైన అడ్లూర్, టెకిర్యాల్ , కాల్సిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వరపల్లిని కలుపుకుని 61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా తయారు చేశారు. మొత్తం పట్టణాన్ని ఇండస్ట్రియల్, గ్రీన్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లుగా విభజించారు. ఆ వివరాలను ఈ మధ్యే ప్రకటించారు.
2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు . పారిశ్రామిక జోన్ కోసం 1200 ఎకరాలతో 8.5 శాతం ప్రతిపాదించారు. ఇందులో నేషనల్ హైవే పక్కన పచ్చని పంటలు పండే.. అడ్లూర్, ఇల్సిపూర్, టెకిర్యాల్, అడ్లూర్ ఎల్లారెడ్డి రైతులకు చెందిన 900 ఎకరాల భూములను చూపారు. దీనివల్ల ఈ భూములు రెసిడెన్షియల్ కింద పనికిరావని చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఈ భూములకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. భవిష్యత్‌లో ఇళ్ల నిర్మాణం కూడా కష్టమవుతుందని భావించిన అన్నదాతలు ఆందోళనబాట పట్టారు.
ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే సహించం: ఇందుకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాటపట్టారు. రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో బాధిత అన్నదాతలు ర్యాలీలు నిర్వహించారు. గ్రీన్ జోన్, ఇండస్ట్రీయల్ జోన్ పేరుతో తరతరాలుగా సాగుచేసుకుంటున్న పచ్చని పంటపొలాల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే సహించబోమని స్పష్టం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండానే అధికారులు ఏకపక్షంగా భూసేకరణ అంచనాలు రూపొందించారని ఆరోపించారు. తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను కాపాడుకునేందుకు తెగించి పోరాడుతామని అన్నదాతలు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: రైతులతో మాట్లాడేందుకు సిద్ధమే కామారెడ్డి కలెక్టర్
'మాస్టర్ ప్లాన్' రగడ.. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద మరోసారి ఉద్రిక్తత