కాళేశ్వరం నీటిని మంజీరా నదిపై కామారెడ్డి జిల్లాలో ఉన్న నిజాంసాగర్ రిజర్వాయర్‌కు మళ్లించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నీటిపారుదలశాఖ కసరత్తు ప్రారంభించింది. మల్లన్నసాగర్ నుంచి నిజాంసాగర్‌కు నీటిని మళ్లించే పనుల్లో జాప్యం జరుగుతుండటంతో ప్రత్యామ్నాయంగా కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి మంజీరా నదికి మళ్లించి నిజాంసాగర్ నింపడానికి చర్యలు తీసుకోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరాం తదితరులు ఇటీవల ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని పరిశీలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అసలు ప్రణాళిక ఇదీ..
- కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నీటిని మల్లన్నసాగర్ నుంచి మంజీరా నదిపై ఉన్న సంగారెడ్డి సమీప సింగూరు డ్యాంకు తరలించే పనులను 3 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు.
- మల్లన్నసాగర్ నుంచి ఒక కాలువ (సంగారెడ్డి కాలువ) ద్వారా సింగూరుకు నీటిని మళ్లించడంతో పాటు మధ్యలో ఆయకట్టుకు నీటిని సరఫరా చేయనున్నారు.
- ఇంకో కాలువ ద్వారా కొండపోచమ్మకు, గంధమల, బస్వాపుర రిజర్వాయర్లకు నీటిని మళ్లిస్తారు. ఇందులో కొండపోచమ్మ రిజర్వాయర్ ఇప్పటికే పూర్తయింది. నీటిని కూడా నింపారు.
- మల్లన్నసాగర్ నుంచి నిజాంసాగర్ డ్యాంకు నీటిని మళ్లించే కాలువ పనులు ఇంకా జరుగుతున్నాయి. ఈ కాలువ తవ్వకంలో ఒక చోట 11.525 కి.మీ, ఇంకో చోట 3.65 కి.మీ దూరం సొరంగమార్గాలు తవ్వాల్సి ఉంది. ఈ పనుల్లో జాప్యం జరుగుతుండటంతో కొండపోచమ్మ నుంచి మళ్లించడానికి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
కొండపోచమ్మ నుంచి మళ్లింపు ఇలా..
హల్దీ నది సంగారెడ్డి కాలువ మీదుగా వెళ్లి మంజీరా నదిలో సింగూరు దిగువన.. నిజాంసాగర్ ఎగువన కలుస్తుంది. కొండపోచమ్మ నుంచి సంగారెడ్డి కాలువ ఆరో కిలోమీటర్ వరకు కాలువతవ్వి నీటిని తరలిస్తే.. అక్కడినుంచి మంజీరాలో కలిసి నిజాంసాగర్‌కు వెళ్తాయి. ఈమధ్యలో హల్దీ నదిపై ములుగు మండలంలోని వర్గల్‌వద్ద ఉన్న ఖాన్ చెరువుకు నీటిని మళ్లిస్తారు. ఇది ఓవర్‌ఫ్లో అయి దిగువన మరో 2చెరువులనూ నింపి నిజాంసాగర్‌పైన మంజీరాలోకలుస్తుంది.
మొత్తంగా సింగూరు డ్యాంకు 4వేల క్యూసెక్కుల నీటిని మళ్లించాల్సి ఉండగా, ప్రస్తుత ప్రత్యామ్నాయం ద్వారా 1500 నుంచి 2 వేల క్యూసెక్కుల వరకు మళ్లించడానికి అవకాశం ఉంది.
ఇదీ చదవండి : కాళేశ్వరం ఎత్తిపోతలు మళ్లీ మొదలు.. 10 టీఎంసీల తరలింపే లక్ష్యం