యాసంగి సాగు విద్యుత్తు సరఫరా వేళలు ఇంకా ఖరారు కాలేదు. ప్రభుత్వం రైతులకు 24 గంటల పాటు అందిస్తున్నట్లు చెబుతున్నా.. ఆరు నెలలుగా కేవలం 12 గంటలే ఇస్తున్నారు. రాత్రివేళలో నిలిపివేస్తున్నారు. ఉదయం పూట అప్పుడప్పుడు గంట నుంచి గంటన్నర పాటు కోతలు విధిస్తున్నారు. వానాకాలం సాగులో పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. ప్రస్తుతం రైతులందరూ యాసంగిపై దృష్టి సారించారు. నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల్లో నారుమళ్లు తయారు చేసుకుంటున్నారు. జనవరి మొదటి, రెండో వారం నుంచి నాట్లు వేయనున్నారు. ఈ పరిస్థితుల్లో పూర్తి సమయంలో విద్యుత్తు సరఫరా లేకుంటే సాగు ప్రశ్నార్థకం కానుంది.
ఇదీ పరిస్థితి.. ఉభయ జిల్లాల్లో చాలా వరకు బోరుబావుల ఆధారిత వ్యవసాయమే ఉంది. భూగర్భజలాలు సమృద్ధిగా ఉండటంతో రైతులు యాసంగిలో వరినే ఎంచుకుంటున్నారు. గతేడాది ధాన్యం సేకరించబోమని సర్కారు తెగేసి చెప్పినా.. చాలా మంది అదే పంట వేశారు. ఈసారి వానాకాలం సీజన్‌కు కొంచెం అటుఇటుగా నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు.
నీటి అవసరం అధికం.. వరికి నీటి అవసరం ఎక్కువ. జనవరిలో నాట్లు వేసుకుంటే ఏప్రిల్-మే మధ్యకాలంలో దిగుబడి చేతికొస్తుంది. మార్చిలో వేసవి ఎండలు పెరగనున్నందున రెండు నెలల పాటు నీరు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇస్తున్నట్లు విద్యుత్తు సరఫరా ఉంటే సాగుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్తు కనెక్షన్ల వివరాలు: కామారెడ్డి 1.05 లక్షలు బోరు బావులు, నిజామాబాద్ 1.60 లక్షలు
ఉత్తర్వులు రాలేదు: ప్రభుత్వం ఆదేశానుసారం యాసంగి సాగుకు విద్యుత్తు సరఫరా చేస్తాం. ఎన్ని గంటల పాటు అనేదానిపై ఇంకా ఉత్తర్వులు రాలేదు. ఇప్పటికైతే 13 గంటలు ఇస్తున్నాం. ప్రభుత్వం 24 గంటల పాటు ఇవ్వమంటే అందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం కోతలు పూర్తికావడంతో లోడ్ భారం తగ్గింది. -రమేశ్‌బాబు, ఎస్‌ఈ, విద్యుత్తుశాఖ, కామారెడ్డి
ఇవీ చదవండి: