కరోనా వైరస్ వచ్చిన వ్యక్తి ద్వారా ఎంత మందికి వైరస్ వ్యాప్తి చెందుతుందో తెలుసుకునేందుకే శాంపిల్స్ సేకరిస్తున్నామని ఐసీఎంఆర్ బృందం కామారెడ్డి జిల్లా కో-ఆర్డినేటర్ దినేశ్ బుకారియా తెలిపారు. కామారెడ్డి జిల్లాలో రెండ్రోజులుగా శాంపిల్స్ సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.
గురువారం.. జిల్లా కేంద్రంలోని నాలుగో వార్డు ప్రజల నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఇంటింటికి తిరుగుతూ 10 సంవత్సరాల పై బడిన వారి నుంచి నమూనాలు తీసుకున్నారు
జిల్లాలో కరోనా ఇన్ఫెక్షన్ రేట్ 0.3 మాత్రమే ఉందని ఐసీఎంఆర్ కో-ఆర్డినేటర్ దినేశ్ తెలిపారు. వైరస్ ప్రారంభమైన మొదట్లో ఒకటి రెండు ల్యాబుల్లో మాత్రమే పరీక్షలు జరిగేవని, ప్రస్తుతం దేశంలో ఒకే రోజు 11 లక్షల టెస్టులు చేస్తున్నామని వెల్లడించారు. టెస్టుల చేయడం వల్లే కేసులు బయటపడుతున్నాయని స్పష్టం చేశారు.
గతంలో ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపించేదని ప్రస్తుతం వ్యాప్తి రేటు తగ్గిందన్నారు. వ్యాప్తి రేటు ఎంత తగ్గిందో తెలుసుకోవడానికే ఈ సర్వే చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో 10 గ్రామాల్లో.. గ్రామానికి 40 మంది చొప్పున నమూనాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐసీఎంఆర్ బృందం సభ్యులు, జిల్లా వైద్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఇంట్లో తెలియకుండా వచ్చే దుర్వాసనకు చెక్ పెట్టేయండిలా..