జోగులాంగ గద్వాల జిల్లాలో సంచలనం రేపిన కార్తీక్ హత్య, రాగసుధ ఆత్మహత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రాగసుధే...కార్తీక్‌ను చంపించిందని పోలీసుల విచారణలో తేలింది. రెండో ప్రియుడు రవితో హత్య చేయించింది. ఎక్కడ తన పేరు కూడా బయటకొస్తుందోనన్న భయంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు సీఐ హనుమంతు వెల్లడించారు.
ఇద్దరితో రాగసుధ ప్రేమాయణం...
జోగులాంబ గద్వాలకు చెందిన రాగసుధ, కార్తీక్ డిగ్రీలో క్లాస్మేట్స్, రవి వీళ్లకు సీనియర్. ఆమె ఈ ఇద్దరికీ దగ్గరయింది. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం సాగించింది. కార్తీక్‌కి రవి విషయం తెలిసి రాగసుధని మందలించాడు. రోజూ ఫోన్ చేస్తూ వేధిస్తుండటం వల్ల కార్తీక్‌ని దూరం పెట్టింది. అంతేకాదు..కార్తీక్ తనని వేధిస్తున్నాడని అడ్డుతొలిగిస్తే ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చని రవిని వేడుకుంది.
మద్యం తాగించి మట్టుబెట్టారు..
తన ప్రేయసిని వేధిస్తున్న కార్తీక్‌ని ఎలాగైనా మట్టుబెట్టాలనుకున్న రవి తన స్నేహితులో కలిసి ఈ నెల 24న కార్తీక్‌ని బయటకు తీసుకెళ్లాడు. మద్యం తాగించి రాడ్డుతో కొట్టారు..బండరాళ్లతో మోది దారుణంగా చంపేశారు. రాత్రంతా కారులోనే శవాన్ని ఉంచారు. మరుసటిరోజు కొండపల్లి సమీపంలోని 99 ప్యాకేజీ పనులు జరుగుతున్న స్థలంలో పూడ్చి పెట్టారు.
దొరికిపోతాననే భయంతో రాగసుధ ఆత్మహత్య
కొండపల్లి దగ్గర గుట్టల్లో నెట్టెంపాడు కాల్వ పనులు జరుపుతుండగా శుక్రవారం కార్తీక్ మృతదేహం దొరికింది. విషయం తెలుసుకున్న రాగసుధ భయాందోళనకి గురైంది. ప్రియుడు రవి కూడా అరెస్ట్ కావడం.. తొందర్లోనే తనని కూడా పోలీసులు విచారించి అరెస్ట్ చేస్తారని భయపడింది. ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తమ సోదరుడికి, భర్తకి ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పింది. కార్తీకే తన మృతికి కారణమని ఓ లేఖ కూడా రాసిపెట్టి మహబూబ్‌నగర్‌లోని తన ఇంట్లో ఉరి వేసుకుంది.
పోలీసులపై మృతుని బంధువుల అనుమానం
కార్తీక్‌ని బండరాళ్లతో మోది చంపిన రవితోపాటు విజయ్, మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు పోలీసుల సహకారం కూడా ఉందని... మృతుడు కార్తీక్ బంధువులు ఆరోపిస్తున్నారు. వెంటనే కేసును సీబీసీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి: పాత స్నేహమే ఆ ఇద్దరి ప్రాణాలు తీసిందా...?