జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడు వాసులు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. గత పది రోజులుగా నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నారు. సరైన వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటిపోవటం వల్ల కష్టాలు మొదలయ్యాయి.
ఎండిపోయిన బావి
రెండు వేల జనాభా ఉన్న ఈ గ్రామానికి నీళ్లు లేని ఇటిక్యాలపాడు అనే పేరు కూడా ఉంది. గ్రామంలో ఎక్కడ బోరు వేసిన ఉప్పు నీరు రావడం వల్ల ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలోని బావి నుంచి సరఫరా చేసుకునేవాళ్లు. కానీ గత సంవత్సరం ఆ బావి కూడా ఎండిపోయింది. బావి పక్కనే బోరు వేసి వాడుకునేవారు. వాతావరణ పరిస్థితులతో ఉన్న ఆ ఒక్క బోరు కూడా అడుగంటిపోయేలా ఉంది.
నీళ్లు కొనడం
నీటి కొరత తీవ్రంగా ఉండటం వల్ల పది రూపాయలు పెట్టి బిందె నీళ్లు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని మహిళలు వాపోతున్నారు. చిన్న జనాభా ఉన్న గ్రామానికి ఇలాంటి నీటి సమస్య ఉంటే... పెద్ద గ్రామాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మిషన్ భగీరథ త్వరగా పూర్తి చేసి నీటి సరఫరా చేయాలని కోరుతున్నారు. తమ సమస్యను గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన ఇంతవరకు పరిష్కారం కాకపోవడం బాధకారమన్నారు.
ఇవీ చూడండి: భార్య పుట్టింటికి వెళ్లిందని పిల్లల్ని హతమార్చాడు