Students' letter to High Court Judge: జోగులాంబ గద్వాల జిల్లాలోని కొన్ని ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. విద్యార్థులకు సరైన విద్య అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గట్టు మండలం ఇందువాసి ఉన్నత పాఠశాలలో 320 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ పాఠశాలకు 6 ఉపాధ్యాయులను ప్రభుత్వం కేటాయించింది. అందులో ఐదుగురు మాత్రమే విధులు నిర్వర్తించారు. ఇటీవల తీసుకొచ్చిన 317తో.. నలుగురు బదిలీపై వెళ్లారు. అనంతరం ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించారు. విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలకు సరిపడా సిబ్బంది లేకపోవటంతో చదువులు ముందుకు సాగడం లేదు. ఇప్పటికైనా తమ పరిస్థితిని అర్ధం చేసుకొని ఉపాధ్యాయులను రప్పించాలని విద్యార్థులు హైకోర్టు జడ్జికి లేఖ రాశారు.
'పది' పరీక్షలు ఎలా..?
జిల్లాలోని చాలా వరకు ఉన్నత పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఏ ఒక్క పాఠశాలలో పూర్తి స్థాయిలో అన్ని సబ్జెక్టులు బోధించేవారు లేరన్న ఆరోపణలు వస్తున్నాయి. ముగ్గురు, నలుగురు ఉపాధ్యాయులతోనే కాలం వెళ్లదీస్తుండటంతో గ్రామీణ విద్యార్థులు ఎక్కువగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఇందువాసి గ్రామంలో సరిపడా ఉపాధ్యాయులు లేరని విద్యార్థులు చెబుతున్నారు. భౌతిక శాస్త్రం, తెలుగు, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం బోధించేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నెల రోజుల్లో పదో తరగతి పరీక్షలు వస్తుండటంతో ఎలా చదవాలో అర్థంకాక సతమతమవుతున్నారు.
ఉపాధ్యాయుల ఆశాభావం..
పాఠశాలలో సిబ్బంది సమస్యపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు విద్యార్థుల చదువులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: దేశంలో ఉగ్రదాడికి భారీ కుట్ర.. 28మంది అనుమానితుల అరెస్ట్