Sand Shortage: జిల్లాగా అవతరించిన తర్వాత గద్వాల శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. స్థిరాస్తి వ్యాపార జోరుతో పాటు నిర్మాణరంగం ఊపందుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా... ప్రస్తుతం ఇసుక కొరత వేధిస్తోంది. ఇళ్లు నిర్మించుకుంటున్న సామాన్య, మధ్యతరగతి వారికి ప్రతిబంధకంగా మారింది. గృహ నిర్మాణాలు నిలిచిపోవడం వల్ల దానిపైనే ఆధారపడ్డ 8 వేల మంది కార్మికులు, 4 వేల మంది మేస్త్రీల ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నచోట పని కరవై పొట్టచేతపట్టుకుని హైదరాబాద్, రాయచూర్ ప్రాంతాలకు వలస వెళుతున్నారు.
అనుమతివ్వని అధికారులు...
నదులకు వరదలు వచ్చాయని గనులశాఖ అధికారులు ఇసుక రవాణాకు అనుమతివ్వకపోవడం వల్ల సమస్య తలెత్తింది. స్తోమత ఉన్నవారు రెట్టింపు ఖర్చుపెట్టి కాళేశ్వరం, వరంగల్ ప్రాంతాల నుంచి ఇసుక తెప్పించుకుంటున్నారు. సామాన్యులు, మధ్యతరగతి వారు మాత్రం ఇళ్లు కట్టలేక మధ్యలోనే ఆపేస్తున్నారు. వేలాది మందికి ఉపాధి చూపించే నిర్మాణరంగానికి ఇసుక కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి ఇసుక కొరత తీర్చాలని ఇళ్ల నిర్మాణదారులు కోరుతున్నారు. ఏడునెలలుగా వెతలు పడుతున్న నిర్మాణరంగ కార్మికుల గోడు తీర్చాలని వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి: