విజ్ఞాన సాంకేతిక రంగాలలో మరింత అభివృద్ధి సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలు చేపడుతుంది. మారుమూల ప్రాంతాల విద్యార్థుల సృజనాత్మక శక్తిని తట్టిలేపి.. వారి చేత నూతన ఆవిష్కరణలకు ఆజ్యం పోస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల టాలెంట్ మరుగున పడిపోకుండా సరికొత్త ఆవిష్కరణలను వెన్నుతట్టి ప్రోత్సహించే కొత్త కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగానే.. తెలంగాణ ఇన్నోవేషన్ యాత్ర ప్రారంభించింది. గద్వాలలో ప్రారంభమైన ఈ యాత్ర నాలుగు రోజుల పాటు సాగి.. హైదరాబాద్ టీ-హబ్లో ముగుస్తుంది.
జోగులాంబ గద్వాలలోని హరిత హోటల్లో తెలంగాణ ఇన్నోవేషన్ యాత్రను జిల్లా కలెక్టర్ శృతి ఓజా జెండా ఊపి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత విద్యార్ధులలో సరికొత్త ఆలోచనలను వెలికి తీసే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
వివిధ జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేశారు. విద్యార్ధులు పంపిన వీడియోల ఆధారంగా ఎంపిక చేసినవారిని ఇన్నోవేషన్ యాత్రకు తీసుకెళ్లారు. మొత్తం 120 మందిని నాలుగు బృందాలుగా చేసి.. నాలుగు భాగాలకు పంపారు. యాత్ర ముగిసిన తర్వాత విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలను ఆవిష్కరించాలి.
ఇదీ చూడండి: ఒరేయ్ బుజ్జిగా సాంగ్: విలవిలవాడే నిన్నే చూసి ప్రాణం