- గత ఆగస్టులో శ్రీశైలం భూగర్భజల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంతో నెలరోజుల పాటు 6 యూనిట్లు నిలిచిపోయాయి. ఒక్కో యూనిట్ విద్యుదుత్పత్తి సామర్థ్యం 150 మెగావాట్లు. తరవాత నెలలో రెండు యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కొక్కటిగా అయిదు యూనిట్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రాజెక్టు ఏడాది విద్యుదుత్పత్తి లక్ష్యం 1400 మిలియన్ యూనిట్లు, కాగా 1231.541 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని సాధించారు.
- ఎగువ జూరాల ప్రాజెక్టులో 39 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన అయిదో యూనిట్ వరద ప్రారంభం నుంచే సాంకేతికలోపంతో నిలిచిపోయింది. ఇంకా మరమ్మతు దశలోనే ఉంది. జూరాల లక్ష్యం 186 మిలియన్ యూనిట్లు. ఒక యూనిట్ అందుబాటులో లేనప్పటికీ ఎగువ నుంచి ఎక్కువ రోజుల పాటు వరద కొనసాగడంతో 5 యూనిట్లతోనే లక్ష్యాన్ని అధిగమించి 370.503 మి.యూ. ఉత్పత్తి సాధించింది.
- నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన ఒక యూనిట్ సాంకేతికలోపంతో ఏడాదంతా ఉపయోగంలోకి రాలేదు. ఇంకా మరమ్మతు పూర్తి కాలేదు. ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి లక్ష్యం 1290 మి.యూనిట్లు. ఒక యూనిట్ అందుబాటులో లేకున్నా 1248.775 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది.
- మూడు ప్రాజెక్టులలో అంతరాయం కలిగినా లోయర్ జూరాల, పులిచింతల, పోచంపాడు ప్రాజెక్టుల్లో లక్ష్యానికి మించి విద్యుదుత్పత్తి రావడంతో లక్ష్యాన్ని అధిగమించి అదనంగా 436.152 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి వచ్చింది.
సిబ్బంది కృషి ఫలితం
శ్రీశైలం ప్రాజెక్టులో దురదృష్టవశాత్తు ప్రమాదం జరగడం, ప్రాణనష్టం జరగడం బాధాకరం. అందువల్ల సెప్టెంబరులో జల విద్యుదుత్పత్తి లక్ష్యం మేర జరగలేదు. ఆ నెల మినహాయిస్తే 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు ప్రతి నెలలో లక్ష్యం మేరకు జల విద్యుదుత్పత్తిని సాధించాం. లక్ష్యానికి మించి విద్యుదుత్పత్తి జరగడం జెన్‌కోలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కృషి వల్ల సాధ్యపడింది. శ్రీశైలంలో పునరుద్ధరించిన యూనిట్లలో ఉత్పత్తిని కొనసాగిస్తూనే మిగిలిన యూనిట్లను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియను కొనసాగించాం. త్వరలోనే మిగిలిన యూనిట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఎగువ జూరాల ప్రాజెక్టులో ఒక యూనిట్‌కు అవసరమైన పరికరాలను చైనా నుంచి తెప్పిస్తున్నాం.నాగార్జునసాగర్‌లో ఒక యూనిట్ సాంకేతిక లోపంతో అందుబాటులో లేదు. మరమ్మతులు త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
- సురేశ్, జెన్‌కో చీఫ్ ఇంజినీర్
ఇదీ చదవండి: పల్లెలను కబళిస్తున్న కరోనా మహమ్మారి