ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గత ఎన్నికలతో పోల్చితే.. ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదైంది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్నాహ్నానికి పుంజుకుంది. సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరడంతో.. లైన్లో ఉన్న వారికి అధికారులు 6 గంటల వరకూ అవకాశమిచ్చారు.
ఓటేసిన ప్రముఖులు:
పాలమూరు జిల్లాలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి వారి వారి పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్ కలెక్టర్ వెంకట్రావు, నారాయణపేట కలెక్టర్ హరిచందన జిల్లా కేంద్రాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు.
ఓటర్ల అవస్థలు:
పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పినా.. కొన్నిచోట్ల మంచి నీరు, టెంట్ లేక ఎండ తీవ్రత మరో కారణంగా ఓటర్లు ఇబ్బంది పడ్డారు. అవసరమైన చోట్ల రెండు కౌంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ సూచించినా.. చాలా చోట్ల ఒకటే కౌంటర్‌తో పోలింగ్‌ను జరపడంతో ఓటర్లు గంటల తరబడి లైన్లో వేచి ఉండాల్సి వచ్చింది.
ఓటర్ల సమస్యలు:
బ్యాలెట్ పత్రం పెద్దదిగా ఉండటం, ప్రాధాన్యాత క్రమంలో ఓటు వేయడం, తిరిగి పత్రాన్ని బాక్సులో వేయడానికి ఒక్కో ఓటరుకు 4 నుంచి 5 నిమిషాలు పట్టింది. పోలింగ్ కేంద్రాలకు దూరంగానే వాహనాలు నిలిపి వేయడంతో పార్కింగ్ లేక ఓటర్లు సమస్యలు ఎదుర్కొన్నారు.
పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ తీసుకుపోకూడదన్న నిబంధనలను.. మహబూబ్ నగర్ ప్రభుత్వ కళాశాలలో కొందరు సొమ్ము చేసుకునే ప్రయ్నత్నం చేశారు. మోబైల్‌ను భద్ర పరిచినందుకు గాను రూ. 10లను వసూలు చేశారు. విషయం తెలుసుకున్న మహబూబ్ నగర్ సహాయ రిటర్నింగ్ అధికారి సీతారామారావు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: తెలంగాణ భాజపాపై పవన్ కల్యాణ్ గుస్సా