తుంగభద్ర పుష్కరాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1వ తేది వరకు జరిగే తుంగభద్ర పుష్కరాలను కరోనా నిబంధనలను పాటిస్తూ సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. బాలబ్రహ్మేశ్వరస్వామిని, జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తుంగభద్ర ఘాట్లను పరిశీలించారు.
జిల్లా మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి జోగలాంబ గద్వాల జిల్లా ఉన్నతాధికారులతో అలంపూర్‌లోని హరిత హోటల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. పుష్కరాల నిర్వహణ, కరోనా నిబంధనల అమలుపై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రతిసారి జరిగే విధంగా ఘనంగా నిర్వహించే అవకాశం లేదని.. కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పుష్కరాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
"బృహస్పతి మకరరాశిలో ప్రవేశించే సమయం నవంబర్ 20 మధ్యాహ్నం ఒంటిగంట 23 నిమిషాలకు పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. తెలంగాణలో తుంగభద్ర నది జోగులాంబ గద్వాల జిల్లా కుట్కనూరు గ్రామం వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అలంపూర్ తర్వాత సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. 12 రోజుల పాటు తుంగభద్ర నదిని పుష్కరుడు, ముక్కోటి దేవతలు ఆవహించి ఉంటారని భక్తుల నమ్మకం. ఈ సమయంలో తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. పితృదేవతలకు పిండప్రదానాలు చేస్తే వారి ఆత్మలు శాంతించడంతో పాటు స్వర్గం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ మేరకు 12 ఏళ్లకోసారి జరిగే పుష్కరాలకు భక్తులు పుణ్య స్నానమాచరించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు."- ఆనంద్ శర్మ, ప్రధాన అర్చకుడు, ఆలంపూర్ దేవస్థానం.
"అయితే ఈ ఏడాది నిర్వహించే తుంగభద్ర పుష్కరాలను కరోనా నిబంధనలకు లోబడే నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తుంగభద్ర నది పరివాహకంలో ఉన్న వేణిసోంపురం, కలుగొట్ల, రాజోళి, పుల్లూరు, అలంపూర్ వంటి 5 ఘాట్లలో మాత్రమే ఈ సారి పుష్కర ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ 65 ఏళ్లు పైబడిన వృద్ధులు.. పది ఏళ్లలోపు పిల్లలు, గర్భిణీలు పుష్కర స్నానాలకు దూరంగా ఉండాలని దేవాదాయ శాఖ విఙ్ఞప్తి చేస్తోంది. వచ్చే భక్తులు సైతం భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు తప్పని సరిగా ధరించాలని కోరుతున్నారు. పుణ్య స్నానాల కోసం నీటిపంపులు ఏర్పాట్లు చేయనున్నారు. ఆలయాల ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్‌లను అందుబాటులో ఉంచనున్నారు. 30 లక్షల వ్యయంతో ఆలయాల సుందరీకరణ, తాత్కాలిక చలువ పందిళ్లు, క్యూలైన్లు, టికెట్ కౌంటర్లు, ప్రసాద కౌంటర్లు ఇతర ఏర్పాట్లను దేవాదాయశాఖ చేపట్టనుంది."- అనిల్ కుమార్, కమిషనర్, దేవాదాయశాఖ.
"నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ఘాట్ల మరమత్తులు, జల్లు స్నానాలు, దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేయనున్నారు. ఘాట్లకు వెళ్లే రోడ్ల మరమత్తులు, సూచిక బోర్డులు, బారికేడ్లు, పార్కింగ్ వసతులను రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులు చేపట్టనున్నారు. కరోనా వైరస్ సోకకుండా పారిశుద్ధ్యం, ఘాట్ల వద్ద విద్యుత్ దీపాల ఏర్పాటు, ఫాగింగ్, శానిటైజేషన్ తదితర కార్యక్రమాలు పంచాయతీరాజ్ శాఖ చూడనుంది. గజ ఈత గాళ్లను ఘాట్ల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం గ్రామీణ నీటి సరఫరా శాఖ ఏర్పాటు చేయనుంది. కరోనా వ్యాప్తి చెందకుండా... వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉష్ణోగ్రత కొలిచే యంత్రాలతో పరిశీలించడంతో పాటు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు."- ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి.