ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం జోగులాంబ గద్వాలను హాట్‌స్పాట్‌గా ప్రకటించడం వల్ల ఆ జిల్లాలో కరోనా కట్టడిపై అధికారులు మరింత దృష్టి కేంద్రీకరించారు.
జోగులాంబ గద్వాల
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నివేదిక ప్రకారం ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లాలో 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గద్వాల, అయిజ, వడ్డేపల్లి, రాజోలి ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్ జోన్లు ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయా జోన్లలో ప్రజలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరూ ఇంటినుంచి బయటకు రాకుండా పకడ్బందీగా డ్రోన్‌కెమెరాలతో నిఘా కొనసాగిస్తున్నారు.
ఇటీవల ఏపీలోని కర్నూల్ జిల్లాలో ఓ ప్రముఖ వైద్యుడు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. అనారోగ్యం బారిన పడటానికి ముందు అతని వద్ద వైద్యం చేయించుకున్న వారి కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. స్వచ్ఛందంగా వచ్చి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. ఈ మేరకు గద్వాల, గట్టు మండలాల్లో ఆ వైద్యుని వద్దకు వెళ్లి వచ్చిన వారిని కొందరిని అధికారులు క్వారంటైన్ పంపి వారి నమూనాలను పరీక్షలకోసం పంపారు. రిపోర్టులు రావాల్సి ఉంది.
మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11కు, నాగర్ కర్నూల్ జిల్లాలో 2 కేసులకు మాత్రమే పరిమితమైంది. నాలుగైదు రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. అయినా కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్, రాత్రి వేళ కర్ఫూను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్