ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల కరోనా కొత్త కేసులు లేవు. ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలు సడలించడం వల్ల చాలా వ్యాపార కార్యకలాపాలు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మద్యం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నుంచి వస్తున్న జనంతో జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు కరోనా ముప్పు పొంచి ఉందని అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఉమ్మడి జిల్లా సరిహద్దులతో కలిసి ఉన్న కర్నూలులో కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ జిల్లాలో 500ల మందికిపైగా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఆ జిల్లాను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఆ జిల్లాలోని ప్రధాన పట్టణాలైన కర్నూలు, నంద్యాలలోనే 350 కేసుల వరకు నమోదయ్యాయి.
ఇక్కడ రూ.1,160... అక్కడ రూ.2,030....
ఆ పట్టణాల్లో మద్యం విక్రయాలకు అనుమతి లేదు. దీంతోపాటు ఏపీలో ధరలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో రూ.1,160 ఎమ్మార్పీ ఉన్న మద్యం ఆంధ్రప్రదేశ్‌లో రూ.2,030కు దొరుకుతుంది. మద్యం ప్రియులు అడ్డదారుల్లో వచ్చి ఉమ్మడి జిల్లాలో మద్యం కొనుగోలు చేస్తున్నారు. వీరు రోజూ వస్తుండటం వల్ల రెడ్ జోన్ పరిధిలోని వీరి ద్వారా ఇక్కడ కొందరికి కరోనా అంటుకున్నా వేగంగా విస్తరించే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
రోజుకు 300 నుంచి 350 మద్యం సీసాలు...
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ప్రతి రోజు పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో 5 నుంచి 6 మద్యం అక్రమ తరలింపు కేసులు నమోదవుతున్నాయి. 300 నుంచి 350 మద్యం సీసాలు పట్టుకుంటున్నారు. పోలీసుల తనిఖీల్లోనే ఇంత మద్యం పట్టుబడుతుండగా వెలుగు చూడకుండా తరలుతున్న మద్యం ఇంతకు రెట్టింపైనా ఉంటుందని అంచనా.
నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల పోలీసులు కృష్ణానది పరీవాహక ప్రాంతంలోను, ప్రధాన రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కృష్ణానదిలో నడిపే పుట్టి, మరబోట్లను పూర్తిగా నిషేధించారు. శ్రీశైలం నుంచి జిల్లాకు వచ్చేందుకు వెసులుబాటు ఉండటం వల్ల దోమలపెంట సమీపంలో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. అయినా అడ్డదారుల్లో వస్తున్న జనం, వ్యాపారులు మద్యం కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు.
అలంపూర్ ప్రాంతంలో ఈ తరలింపు ఎక్కువగా ఉంది. ఈ విషయమై వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల ఎస్పీ అపూర్వారావుతో మాట్లాడగా అడ్డదారుల్లోనూ జనం రాకుండా తనిఖీలు పెంచుతామన్నారు.