కృష్ణమ్మ పరవళ్లతో జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటోంది. ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలు పూర్తిగా నిండడం వల్ల సుమారు లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ నీరంతా జూరాలకు వచ్చి చేరుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.8 టీఎంసీల నీరు ఉంది. వరద ఇలాగే కొనసాగితే అన్ని ఎత్తిపోతల పథకాలకు నీరు అందించి.. రెండు మూడు రోజుల్లో శ్రీశైలానికి నీరు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
నీరు విడుదల..
జలాశయానికి వరద ప్రవాహం పెరగడం వల్ల కుడి కాలువకు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సాగునీరు విడుదల చేశారు. ఎడమకాలువకు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ నీరు విడుదల చేశారు. భీమా ఎత్తిపోతల పథకాన్ని కూడా ప్రారంభించారు. నీటిమట్టం పెరిగితే కోయిల్‌సాగర్ జలాశయానికి జూరాల నుంచి నీళ్లు విడుదల చేయనున్నారు. జూన్ నుంచి ఆశించిన వర్షాలు లేక వరద నీరు రాక నిరాశకు లోనైన రైతులు జూరాలకు జలకళ రావడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ.. మూడు యూనిట్ల ద్వారా అధికారులు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. నీటిమట్టం పెరిగితే స్పిల్‌వే గేట్ల ద్వారా కృష్ణానదిలోకి మరో రెండు మూడు రోజుల్లో వరద నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.