జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఈ నెల 20వ తేదీ నుంచి జరగబోయే తుంగభద్ర నది పుష్కరాలను పురస్కరించుకుని ఐజ మండలం వేణి సొంపురం, రాజోలి పుష్కర ఘాట్లను జిల్లా ఎస్పీ రంజన్ రతన్‌కుమార్, జిల్లా అదనపు ఎస్పీ కృష్ణ పరిశీలించారు. పుష్కర ఘాట్‌ను, ఆలయ పరిసరాలను, పార్కింగ్ స్థలాలను జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు. గతంలో పుష్కరాలు జరిగినప్పుడు ఎంత మంది భక్తులు వచ్చారో అందుకు తగ్గట్లు పార్కింగ్, దర్శనానికి క్యూ లైన్ ఏర్పాటు, ఆ గ్రామానికి వచ్చి వెళ్లే మార్గాలలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రాంతాల వివరాలను పోలీసు అధికారులు ఎస్పీకి వివరించారు. వీఐపీ పార్కింగ్, సాధారణ భక్తుల వాహనాలకు పార్కింగ్, అలాగే వృద్ధులకు, వికలాంగులకు కల్పించే ఉచిత పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి సూచనలు చేశారు. ప్రధాన ఆలయం వైపు వచ్చే మార్గాలను, బయటకు వెళ్లే మార్గాలను గుర్తించి బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.
సాధారణ భక్తుల దర్శనాలు, శీఘ్ర దర్శనాలు, ప్రముఖుల దర్శనాలకు వేర్వేరు మార్గాల్లో ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. వీఐపీ పుష్కర ఘాట్‌కు, సాధారణ భక్తుల పుష్కర ఘాట్‌కు లోపలికి వెళ్లే దారి, బయటకు వచ్చే దారిలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా చూసుకోవాలన్నారు. ప్రధాన ఆలయంలోకి వచ్చి వెళ్లే మార్గాలను గుర్తించి బారికేడ్లు ఏర్పాటు చేయించాలని సూచించారు. వేణు సోంపురం గ్రామానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా మార్గాలలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రాంతాలను గుర్తించి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. బందోబస్తు నిమిత్తం వచ్చే పోలీస్ సిబ్బందికి వసతి సౌకర్యాలు కల్పించాలని శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు, ఐజ ఎస్సైకి సూచించారు.
ఇవీ చూడండి: తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల కొట్లాట.. గాల్లో కుర్చీలు