ప్రభుత్వం రూ.25 వేలలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేసినందున జిల్లాలోని అర్హులైన రైతులందరికీ లబ్ధి చేకూర్చేలా చూడాలని కలెక్టర్ శ్రుతి ఓజా బ్యాంకింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బ్యాంకు మేనేజర్లు, వ్యవసాయాధికారులతో అన్నదాతల రుణ మాఫీపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 93,494 మంది రైతులు వ్యవసాయ రుణాలు తీసుకోగా, రూ.25 వేలలోపు 8,071 మంది తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో ఇప్పటికి 3,068 మందికి రూ.4.95 కోట్లు రుణమాఫీ చేయగా, ఇంకా 5,003 ఖాతాలు సర్దుబాటు చేయాల్సి ఉందన్నారు.
వీటిలో 2,006 ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉండగా, మిగిలిన ఖాతాలు వివిధ సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. వీటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. రుణమాఫీ అయిన రైతులకు తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రవీందర్, యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ శేషగిరిరావు, వ్యవసాయ సహాయ సంచాలకులు సక్రియానాయక్, తదితరులు పాల్గొన్నారు.