కృష్ణానదికి వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద నీరు వస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాంకు లక్షా 40వేల క్యూసెక్కుల వరద వస్తుండగా... లక్షా 80 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి పూర్తి స్థాయి నీటి మట్టం 1705 అడుగులు కాగా.. ప్రస్తుతం 1699 అడుగుల వరకు నీటి నిల్వ కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 100 టీఎంసీల మేర నీరు ఉంది.
నారాయణపూర్‌కు లక్షా 80 వేల క్యూసెక్కుల వరద
ఆల్మట్టి నుంచి నారాయణపూర్‌కు లక్షా 80 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. లక్షా 87వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1615 అడుగులు కాగా.. ప్రస్తుతం 1609 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగిస్తున్నారు. 37 టీఎంసీల సామర్థ్యానికి.. 30 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు పంపుతున్నారు.
జూరాలకు 25వేల క్యూసెక్కుల వరద
ఎగువ నుంచి వస్తున్న వరద పూర్తి స్థాయిలో జూరాలకు చేరలేదు. నిన్న రాత్రి 9 గంటల సమయానికి జూరాలకు 25వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. స్పిల్ ద్వారా 25 వేలు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 25 వేల క్యూసెక్కులు నదిలోకి వెళ్తున్నాయి. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 1045 అడుగులు కాగా.. ప్రస్తుతం 1038 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.567 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.836 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న దృష్ట్యా జలాశయాన్ని అందుకు అనుగుణంగా ఖాళీ చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి 28వేల క్యూసెక్కుల వరద
నెట్టెంపాడు, కోయల్ సాగర్, కుడి, ఎడమ, సమాంతర కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది. జూరాల మొత్తం అవుట్ ఫ్లో ప్రస్తుతం 54వేల క్యూసెక్కులుగా ఉంది. ఇక శ్రీశైలం జలాశయానికి 28వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 38వేల క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. ఈ వరద ప్రస్తుతం నాగార్జునసాగర్‌కు చేరుతోంది. నెల రోజుల్లో జూరాలకు మొత్తం 93 టీఎంసీల వరద రాగా.. 81 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్, జూరాల ఎత్తిపోతల పథకాలకు కేవలం 9 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకున్నారు. స్పిల్‌వే ద్వారా 28 టీఎంసీలు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 53 టీఎంసీలు మొత్తం 81 టీఎంసీల వరద నీరు నదిలోకే వెళ్లింది.
నారాయణపూర్ నుంచి సుమారు లక్షా 80వేల క్యూసెక్కుల వరద జూరాల వైపు వస్తుండగా.. కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో నదీ సమీప గ్రామాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా చర్యలు చేపట్టారు.