'తెరాస పార్టీ జెండా పండుగ'లో అలంపూర్ శాసనసభ్యులు అబ్రహంకు నిరసన సెగ తగిలింది. తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ స్థానిక రైతులు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు.
జోగులంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో తెరాస జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం హాజరయ్యారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం జరుగుతుండగానే స్థానిక రైతులు అక్కడికి చేరుకున్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఎమ్మెల్యేను ప్రశ్నించారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ఆయనతో వాగ్వాదానికి దిగారు.
ఉండవెల్లికి కేటాయించిన కస్తూర్బా విద్యాలయం కలుగోట్ల గ్రామానికి తరలిపోవటం.. ఆర్డీఎస్ కాలువ ద్వారా సాగునీరు ఉండవల్లి మండలంలోని పొలాలకు రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెరాస జెండా పండుగ సందర్భంగా అలంపూర్‌కు వచ్చిన ఎమ్మెల్యేను నిలదీశారు.
పరిస్థితి తీవ్రమయ్యే సూచనలు కనిపించడంతో ఎమ్మెల్యే అబ్రహం, తెరాస నాయకులు అక్కడి నుంచి జారుకున్నారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే తీరుపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా తిరుగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: Trs Bhavan in Delhi: మరో కీలక ఘట్టానికి నాంది... దిల్లీలో తెరాస భవనానికి భూమిపూజ