జోగులాంబ గద్వాల జిల్లా కాకులారంలో మట్టి మాఫియా తెగించింది. అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం రాగా రూరల్ పోలీసులు అక్కడికి వెళ్లారు. అనుమతులు చూపించాలని పోలీసులు అడగగా... పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాట మాట పెరిగి రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డిపై నిందితులు దాడికి యత్నించినట్లు తెలుస్తోంది.
పట్టువదలని ఎస్సై...
ఎస్సై అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పట్టుకునే ప్రయత్నంలో కొన్ని వాహనాలు తప్పించుకుపోగా ఓ టిప్పర్ను గద్వాల ఠాణాకు తరలించారు. ఎస్సై అక్కడి నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నట్లు సమాచారం. మూడు రోజుల నుంచి పత్రికల్లో అక్రమంగా మట్టి తరలింపుపై కథనాలు వస్తున్నాయి.
కలెక్టర్ సీరియస్...
ఈ అంశంపై కలెక్టర్, ఎస్పీ సీరియస్గా ఉన్నారు. అక్రమ రవాణాను నివారించేందుకు పోలీసులు ఇసుక మాఫియాపై చర్యలకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే మట్టి తరలిస్తున్న కాకులవరం గ్రామం నుంచి సమాచారం రాగా రూరల్ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి... అర్ధరాత్రి అక్కడికి వెళ్లారు. అధికార పార్టీ నాయకులమనే అహంకారంతో పోలీసులపై తిరగబడ్డారు.
పోలీసు అధికారులు ఈ ఘటనను తీవ్రంగా తీసుకున్నారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ అంశంపై ఎస్సైని వివరణ కోరగా సమాధానం దాటవేశారు.
- ఇదీ చూడండి: ట్రాఫిక్ కానిస్టేబుల్ను చితకబాదిన వాహన చోదకుడు