జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం అందించేందుకు తగినంత సిబ్బంది సౌకర్యాల లేమి వేధిస్తోంది. ఒకప్పుడు వైద్యులు లేక ఇబ్బంది పడితే ఇప్పుడు మాత్రం సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నారు.
అన్ని విభాగాల్లో పూర్తి స్థాయి సిబ్బంది:
అలంపూర్ ఆస్పత్రిలో అన్ని విభాగాలకు వైద్యులు ఉన్నారు. గైనకాలజీ, పిల్లల వైద్యులతో సహా ఒక సూపరింటెండెంట్ సేవలందిస్తున్నారు. వైద్యులు రోగులను పరిక్షీంచేందుకు సరైన గదులు లేక అందరిని ఒకే చోట చూడాల్సి వస్తోందని స్థానికులు అంటున్నారు. 2005లో 30 పడకల సామర్థ్యంతో ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మించారు. రోజుకు దాదాపు 200 మంది రోగులు ఆస్పత్రికి వస్తున్నారని సిబ్బంది వెల్లడించారు.
వేధిస్తున్న గదుల కొరత:
ఆసుపత్రి పదిహేనేళ్లుగా ఎలాంటి ఆధునికీకరణకు నోచుకోలేదు. నియోజకవర్గంలోని అలంపూర్, ఉండవల్లి, మానవపాడు, ఇటిక్యాల, వడ్డేపల్లి, రాజోలి మండలాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ఆస్పత్రికి వస్తుంటారు. కేవలం 15మంది మహిళలకు, 6 మంది పురుషులకు సరిపడ వార్డులు మాత్రమే ఉన్నాయి. ఆస్పత్రిలో పురుషులు, మహిళలకోసం ప్రత్యేక వార్డులు, వైద్యుల కోసం గదులు, ఓపీ విభాగం, ప్రయోగశాల భవనాలను నిర్మించాలని అలంపూర్ వాసులు కోరుతున్నారు. రోగుల సంఖ్యకు తగినట్లుగా ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.