సీఎం కేసీఆర్ సారథ్యంలో విద్యారంగం కుదేలైందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో విమర్శించారు. తెరాస ప్రభుత్వానికి ఉపాధ్యాయులు, ఉద్యోగులు కేవలం ఎన్నికల సమయంలోనే గుర్తుకొస్తారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా పీఆర్సీ, ఐఆర్ అంశాలు తెర మీదకు తెచ్చారని ఆరోపించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ నిర్వహించిన ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావం తెలిపారు.
కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల లాగే అన్ని రకాల సెలవులను ప్రకటించాలన్నారు. గడిచిన 6 ఏండ్లలో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించక పోవడం, సకాలంలో పీఆర్సీ ఇవ్వక పోవడం, ప్రభుత్వ ఖాళీలను నింపక పోవడం తెరాస ప్రభుత్వ వైఫల్యాలేనన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతురావు, జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షులు, రవికుమార్, భాజపా నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లింది- యువత రావాలి'