కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ప్రాణహిత జలాలను ఎగువకు ఎత్తిపోస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... మూడో దశ ఎత్తిపోతలకు రంగం సిద్ధం చేస్తోంది. కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌస్‌ల ద్వారా ఇప్పటి వరకు నీటిని ఎత్తిపోసి 13 టీఎంసీలకు పైగా ఎగువకు తరలించారు. దాదాపు 50 కిలోమీటర్ల వరకు ప్రస్తుతం గోదావరిలో నీరు నిల్వ ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్‌లో ప్రస్తుతం ఐదు పుంపులు నడుస్తున్నాయి. 1, 2, 3, 4, 6వ పంపులు నీటిని ఎత్తిపోస్తుండగా... ఇందులో ఒకటి, మూడో పంపుల ఆటోమేషన్ కూడా పూర్తైంది. ఐదో పంప్ ఆటో మేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవి పూర్తయ్యేందుకు రెండు, మూడు రోజుల సమయం పట్టవచ్చు. ఒక్కో పంప్ నుంచి 2,300 క్యూసెక్కుల చొప్పున ఐదు పంపుల ద్వారా 11,500 క్యూసెక్కుల నీటిని ఎగువకు తరలిస్తున్నారు.
సుందిళ్లకు 0.5 టీఎంసీ..
అన్నారం పంప్‌హౌస్‌లో రెండు పంపుల ద్వారా నీటి ఎత్తిపోత జరుగుతోంది. ఈనెల 21న ఇక్కడ నీటి పంపింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 0.5 టీఎంసీ నీటిని సుందిళ్లకు తరలించారు. రెండో దశ ఎత్తిపోత కొనసాగుతోంది. మూడో దశ ఎత్తిపోతలకు కూడా ఇంజినీర్లు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం గోలివాడ వద్ద నిర్మించిన సుందిళ్ల పంప్ హౌస్‌లో పంపులను పరీక్షించనున్నారు. ఆ పంపులకు ఆదివారం లేదా సోమవారం వెట్‌రన్ నిర్వహించే అవకాశం ఉంది. పరీక్ష పూర్తయ్యాక ఎత్తిపోతల ప్రారంభించి జలాలను ఎల్లంపల్లి శ్రీపాదసాగర్కు తరలించనున్నారు.
ఇవీ చూడండి : లష్కర్ బోనాలకు ఏర్పాట్లు పూర్తి