జిల్లాలో కోతలు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. వరిధాన్యం కొనుగోలుపై వ్యవసాయ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంఛార్జీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా సమయంలో రైతులు ఇబ్బంది పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
మద్దతు ధరతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. మండల వ్యవసాయ అధికారులు కోవిడ్ నిబంధనలతో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. తూకంలో తేడా వస్తే సెంటర్ ఇంఛార్జీని బాధ్యులుగా చేస్తామని హెచ్చరించారు.
ఆ మండలాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి..
అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లులకు వరిధాన్యం రవాణాలో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకొని ఇతరులకు కాంట్రాక్టు ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోలు పై మొగుళ్లపల్లి, కాటారం, రేగొండ మండలాల నుంచి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని.. పారదర్శకంగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని సూచించారు. ఈ సమీక్షలో జిల్లా అదనపు కలెక్టర్ వైవి. గణేష్, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ భాస్కర్, జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.